బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు అతని మాజీ ప్రేయసి సోమీ అలీ. పాకిస్థాన్ కు చెందిన అమెరికన్ నటి.. గతంలో సల్మాన్ తో పాలు ఒక సినిమాకు ఓకే చెప్పటం.. షూటింగ్ మధ్యలో సినిమా ఆగిపోవటం తెలిసిందే.
ఆందోళన్.. మాఫియా చిత్రాలతో ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. అది కాస్తా షాకింగ్ గా మారటమే కాదు.. పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.
సల్మాన్ నటించిన మైనే ప్యార్ కియా మూవీకి సంబంధించిన ఒక స్టిల్ పెట్టిన ఆమె.. అమ్మాయిల్ని కొట్టేవాడు. నన్ను మాత్రమే కాదు ఎంతోమంది అమ్మాయిల్ని. దయచేసి అతన్ని అభిమానించటం ఆపండి. అతనో శాడిస్ట్. ఈ విషయం మీ ఎవరికీ తెలీదు. అతనో మానసిక రోగి’ అని సల్మాన్ పేరును ప్రస్తావించకుండా పోస్టు చేశారు.
ఈ తీవ్రమైన ఆరోపణ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే.. ఇది కాస్తా పెద్ద ఎత్తున చర్చ రేపటంతో ఆమె తన పోస్టును డిలీట్ చేశారు. సల్మాన్ తో ఆమె చేసిన మూవీకి సంబంధించిన షూటింగ్ సమయంలోనే అతడి ప్రేమలో పడ్డారు. తన ప్రేమను సల్మాన్ కు చెప్పానని.. అతనంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు.
తర్వాతేమైందో తెలీదు కానీ వారిద్దరూ విడిపోయారు. చాలా ఏళ్ల తర్వాత సల్మాన్ ను ఉద్దేశించి ఆమె ఈ తీరులో పోస్టు పెట్టటం షాకింగ్ గా మారింది. అసలేం జరిగిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సల్మాన్ తో పలువురు కథానాయికలతో ప్రేమ ఎపిసోడ్ లు సాగటం.. తర్వాతి కాలంలో వారు విడిపోవటం తెలిసిందే.