కనీ, వినీ ఎరుగని వరదలతో విజయవాడ జలమయం అయింది. కృష్ణమ్మ ఉప్పొంగిపోగడం, మున్నేరు-బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో నగరంలోని 40 శాతానికి పైగా ప్రాంతం వరద ముంపునకు గురైంది. చుట్టూ నీరున్నా తాగడానికి చుక్క నీరు లేక, తినడానికి తిండ లేక కొన్ని ప్రాంతాల్లో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అయితే వరదల్లో ఓవైపు ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే.. మరోవైపు వ్యాపారులు తమ చేతివాటం చూపిస్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని కూటమి సర్కార్ సహాయక చర్యలు చేపట్టింది. ప్రతి ఒక్కరికీ ఆహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో.. అధికారులు ఐదు హెలికాఫ్టర్లు, డ్రోన్లతో ఆహార పంపిణీ చేపట్టారు. అయితే విజయవాడ సింగ్నగర్లో కొందరు వ్యాపారులు, ప్రైవేటు బోట్ నిర్వాహకులు.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలను సేకరించి ప్రజలకు అమ్ముతున్నారు.
శివారు కాలనీలకు ఆహారం తీసుకువెళ్లి బ్లాక్ లో ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటున్నారు. కష్టకాలంలో ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఆహారం పంపిణీ చేస్తున్నా.. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వరద బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 3 రోజులుగా ఆహారం పంపిణీ చేయలేదని.. బ్లాక్లో ఆహారం కొనుగోలు చేసేందుకు డబ్బులు లేవని వాపోతున్నారు.