ఏపీలో ఉన్నది మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళలకు అన్ని రంగాల్లో జగన్ పెద్దపీట వేశారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. మహిళల రక్షణకు జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ చట్టం, యాప్ తీసుకువచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం జగన్ కూడా దిశ యాప్ పై ఓ భారీ కార్యక్రమం నిర్వహించి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటూ పోలీసు శాఖ ద్వారా నానా హంగామా చేయించారు.
ఆ రోజు జరిగిన కార్యక్రమం ప్రారంభోత్సవం కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రకటనలిచ్చింది. అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇక, దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలంటూ ప్రధాన నగరాల్లో బ్యానర్లు, హోర్డింగుల కోసం కూడా జగన్ సర్కార్ భారీగానే ఖర్చు పెట్టింది. అయితే, గత ప్రభుత్వంలో నాటి సీఎం చంద్రబాబు ’ఫోర్త్ లయన్ యాప్’ను కాపీ కొట్టి చట్టబద్ధత లేని దిశ యాప్ గా జగన్ మార్చారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ప్రేమోన్మాది దాడిలో చనిపోయిన రమ్య కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని జగన్ ఇవ్వడంతో దిశ కోసం ప్రకటనల రూపంలో పెట్టిన ఖర్చు చర్చనీయాంశమైంది. ఇంకా పార్లమెంటులో ఆమోద ముద్ర పడకుండా ఉన్న దిశ చట్టం కోసం జగన్ దాదాపుగా రూ.30 కోట్ల విలువైన ప్రకటనలు తమ సొంత పత్రిక సాక్షిలో వేయించారన్న ప్రచారం జరుగుతోంది. దిశ చట్టం ఇంకా ఆమోదం పొందలేదని, కేంద్రం ఆమోదించగానే ఏపీలో దిశ చట్టం అమలు చేస్తామని బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టారు వైసీపీ నేతలు.
అయితే, సవరణలు చేసి మరోసారి దిశ బిల్లును పంపాలంటూ ఆ బిల్లును తిరిగి ఏపీకే పంపామని పార్లమెంటు సాక్షిగా వెల్లడైంది. దీంతో, అసలు లేని దిశ యాప్, దిశ చట్టం పేరు చెప్పి సొంత పత్రిక, ఛానల్ కి 30 కోట్లు ప్రకటనలు జగన్ ఇచ్చుకున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉన్మాది చేతిలో బలైన రమ్యకు కేవలం రూ.10 లక్షలని, కానీ, లేని చట్టం కోెసం ప్రకటనలతో సాక్షి రూ.30కోట్లు గడించిందని విమర్శలు వస్తున్నాయి.