ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీలకనాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి ఉంచాలనేదే తమ విధానమని చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలను అనేక మంది తప్పుపడుతున్నారు. మేధావుల నుంచి రాజకీయ నేతల వరకు అందరూ.. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరింత రియాక్ట్ అయ్యారు.
విడిపోయిన రెండు రాష్ట్రాలు తిరిగి కలవడం జరిగేది కాదని సీఎల్పీ నేత భట్టి విక్కమార్క అన్నారు. అంతేకాదు, సమైఖ్య నినాదం ముగిసిన అధ్యాయమని వ్యాఖ్యానించారు. సమైఖ్య రాష్ట్ర నినాదమనేది సజ్జల వ్యక్తిగతమని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోరుకున్నందునే కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్లు వివరించారు.
అంతేకాదు, రెండు రాష్ట్రాలుకలిసి ఉండాలనేది.. ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానం కాదన్న నాయకులు.. గతంలో తెలంగాణ కోసం కేంద్రానికి లేఖ రాసింది నిజం కాదా? అని వైసీపీపై నిప్పులు చెరిగారు. రాజకీయాలల్లో నిరంతరం కుట్రలు జరుగుతూనే ఉంటాయని, మళ్లీ సెంటిమెంట్‌ను రగిలించడం కుట్రలో భాగమేనని తీవ్రస్థాయిలో ఆరోపించారు.
తెలంగాణ ప్రజలు కలిసి ఉండాలని అనుకుంటే.. గతంలో ఎందుకు బలిదానాలు జరిగాయని ప్రశ్నించారు. సమైఖ్య రాష్ట్ర నినాదమనేది వ్యర్థమని విమర్శలు గుప్పించారు. మరో నేత పొన్నం ప్రభాకర్ కూడా ఇదే విధంగా రియాక్ట్ అయ్యారు. సమైఖ్య నినాదం ముగిసిన అధ్యాయమని వ్యాఖ్యానించారు. విడిపోయి దాదాపు పదేళ్లు అయిపోతున్న సమయంలో ఇప్పుడు మరో చిచ్చుకు వైసీపీ రెడీ అవుతోందా? అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్లో రాజ్యాంగ బద్ధంగా విడిపోయిన తెలంగాణను ఏపీతో కలిపి ఉంచడం.. మోడీ కాదు కదా.. మోడీని మించిన మోడీలు వచ్చినా సాధ్యం కాదన్నారు. సజ్జల చేసిన వ్యాఖ్యల వెను రాజకీయ కుట్ర ఉందని అనిపిస్తున్నట్టు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదని, కానీ, కలిసి ఉంచాలనడం వెనుక.. ప్రస్తుత సమస్యలను పక్కదారి పట్టించి.. కేసీఆర్‌కు మేలు చేసేలా వ్యూహం అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.