టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ RRR సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. జక్కన్న దర్శకత్వ ప్రతిభకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల అద్భుత నటన కలగలిపి ఈ సినిమా రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ చిత్రంపై పలువురు దర్శక నిర్మాతలు, సినీ ప్రముఖులు, సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. అయితే, పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయిన ఈ చిత్రంపై వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ గతంలో వివాదాస్పద రివ్యూ ఇచ్చాడు.
రాజమౌళి రూ.600 కోట్లు ఖర్చుపెట్టి ఓ తలా తోక లేని సినిమా తీశారని, అందుకోసం 6 నెలలు పాటు ఆయనను జైలులో పెట్టాలని RRRపై KRK నెగిటివ్ ట్వీట్స్‌తో విమర్శలు గుప్పించాడు. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు తీయనటువంటి చెత్త సినిమా ఇదని, బాలీవుడ్ డిజాస్టర్ మూవీ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ వంటి సినిమా ఇదని అక్కసు వెళ్లగక్కాడు. అయితే, కమల్ ఆర్ ఖాన్ తరహాలోనే ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన సౌండ్ ఇంజనీర్ రేసుల్ పోకొట్టి షాకింగ్ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఆర్ఆర్ఆర్ సినిమా ఒక గే లవ్ స్టోరీ (స్వలింగ సంపర్కులు) అంటూ రేసుల్ పోకొట్టి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.నటుడు, రచయిత మునీష్ భరద్వాజ్ ట్వీట్ కు స్పందించిన రేసుల్ ఈ రకంగా అభ్యంతరకర ట్వీట్ చేయడం దుమారం రేపుతోంది. దీంతో, ఆ ట్వీట్ పై బాహుబలి సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరో ట్వీట్ చేశారు.
‘‘మీరు చెప్పినట్టు ఆర్ఆర్ఆర్ సినిమా ఒక గే లవ్ స్టోరీ అని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అయినా అందులో తప్పు ఏముంది? మీరు దీన్ని ఎలా సమర్థించుకుంటారు? మీ లాంటి వారి ఉద్దేశ్యాలు ఇంతలా దిగజారడం పట్ల తీవ్ర నిరాశ చెందాను’’ అని శోభు ట్వీట్ చేశారు.
శోభు దెబ్బకు దిగొచ్చిన రేసుల్ తన ట్వీట్ ను సమర్థించుకునే పనిలో పడ్డాడు. ‘‘మీతో ఏకీభవిస్తున్నాను. ఒకవేళ ఇది నిజమే అయినా అందులో తప్పేమీ లేదు. నా ఫ్రెండ్ ను కోట్ చేశానంతే. దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు. ఎవరికీ నేరాన్ని ఆపాదించదలుచుకోలేదు’’ అంటూ రేసుల్ మరో ట్వీట్ చేశాడు. ఇద్దరు ప్రాణ స్నేహితులను గే లు అనుకున్న రేసుల్ పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.