ఓ విధంగా చిత్తూరులో పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి మాట చెల్లదు..ఇది తరుచూ వైసీపీ నుంచి వినిపించే మాట.
అందుకు 100 కారణాలున్నాయి అని తెలుస్తోంది. కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో చెల్లుతుంది ఎందుకని ? ఆ వివరం ఈ కథనంలో.. చిత్తూరులో నగరి నియోజకవర్గంలో మాత్రమే రోజా మాట నడుస్తుంది అనుకోవడానికి వీల్లేదు.
ఇక్కడ కూడా ఆమెకు తలనొప్పులున్నాయి. ఇక్కడ కూడా పెద్దాయన మాట నడిచిన దాఖలాలు ఉన్నాయి అని తెలుస్తోంది. పెద్దాయన అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (విద్యుత్ శాఖ మంత్రి) అని అర్థం. అయినా కూడా రోజా ఒంటిచేత్తో అన్ని పనులూ చక్కదిద్దేయాలని తాపత్రయం పడుతుంటారు..అదేవిధంగా తన మాటే నెగ్గాలని మిక్కిలి విశ్వాసంతో పనిచేస్తుంటారు..అన్నవి కూడా ఇక్కడ ఆమె గురించి తరుచూ వినిపించే మాటలు.
కానీ వాస్తవానికి ఇక్కడ నెగ్గేది పెద్దిరెడ్డే అన్నది చాలా సార్లు నిరూపణ అయిన నిజం. అయినా కూడారోజా తగ్గేదేలే అన్న విధంగా సొంత పార్టీ సభ్యులపై తన మాట వినని పెద్దలపై అరుస్తుంటారు అని విజువల్స్ తో సహా వచ్చేయి. ఆ దృశ్యాలు చూశాక సీఎం వర్గాలు కూడా కొంత అప్రమత్తమై ఆమెను రాజధానికే పరిమితం చేయాలన్న తలంపుతో కొంత వరకూ పార్టీ పనులు అప్పగించడమో లేదా ఏపీఐఐసీ పదవి అప్పగించి కూల్ చేయడమో చేశాయి.
కానీ పురపాలక ఎన్నికల్లో మాత్రం రోజా మాట నెగ్గలేదు అని తేలిపోయింది. ఆ రోజు ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. అదేవిధంగా మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆమె మాట నెగ్గలేదు. వాటినే అడ్రస్ చేస్తూ ఆమె అధిష్టానంకు ఫిర్యాదు కూడా చేశారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఆమెను మంత్రి పదవికి ఎంపిక చేశారు. దీంతో అక్కడ రాజకీయ వాతావరణం బాగా సర్దుకుంది. పదవీ ప్రమాణం వేళ పెద్దిరెడ్డి కాళ్లు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకోవడంతో ఇరు వర్గాల మధ్య వైరం ఆగిపోయింది. ప్రస్తుతానికి ఆగిపోయినా నగరి సీటు అంటేనే చాలా మంది పోటీ పడుతుంటారు కనుక అంత వేగంగా ఈ వివాదం ఆగిందని అనుకోలేం.
మరి! చిత్తూరులో ఆమె మాట నెగ్గలేదు సరికదా ! నెల్లూరు ఎందుకు వచ్చారని ? చిత్తూరుతో పోలిస్తే నెల్లూరు రెడ్లు అస్సలు జగన్ మాటే వినరు. అలాంటిది రోజా మాట ఎలా నెగ్గుతుందని ? అయినా ఆమె తన పనిని కేవలం ఆత్మకూరుకు పరిమితం చేసి, ఎన్నికల ప్రచారం చేసి వస్తే ఎటువంటి తగాదా ఉండదు కానీ పార్టీ ముఖ్య నాయకులపై తన సహజ సిద్ధ ధోరణిలో సెటైర్లు వేస్తే మాత్రం మళ్లీ మళ్లీ ఆమెకు ఇబ్బందులు తప్పవు గాక తప్పవు.