ఆయన అల్లాటప్పా వ్యక్తి కాదు. ఒక సంపన్న దేశానికి ప్రధానమంత్రి. అలాంటి వ్యక్తి నలుగురికి ఆదర్శంగా వ్యవహరించాలి. మిగిలిన వారికి మించిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్ఫూర్తిగా నిలవాలి. కానీ.. ఆయన అలా వ్యవహరించటం లేదు. బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్న ఆయన తీరు తరచూ వివాదాల్లోకి నెడుతోంది. అయితే.. ఆయనకు భారతమూలాలు ఉండటం భారతీయులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇంతకూ ఆ ప్రముఖుడు ఎవరో మీకు ఈపాటికే అర్థమవుతుంది. అవును.. బ్రిటన్ ప్రధానిగా వ్యవహరిస్తున్న రిషి సునాక్ తీరు ఇప్పుడు వార్తలుగా మారుతున్నాయి. ఆయన తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు.
తాజాగా తన కుటుంబంతో పార్కుకు వెళ్లిన రిషి సునాక్.. తమ పెంపుడు కుక్కను స్వేచ్ఛగా వదిలేయటాన్ని తప్పు పడుతున్నారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అధికారి ఒకరు వచ్చి.. పెంపుడు కుక్కకు బెల్టు కట్టకుండా తిప్పటం నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేయాల్సి వచ్చింది. అప్పుడు కానీ ఆయన తన పెంపుడుకుక్క నోవాకు గొలుసు కట్టేశారు. ఇలాంటి తీరు ఆయనపై విమర్శలు వెల్లువెత్తేలా చేస్తోంది.
సదరు పార్కు నిబంధనల గురించి పెద్ద పెద్ద బోర్డులు ప్రముఖంగా ఏర్పాటు చేసినప్పటికి.. రిషి.. ఆయన కుటుంబ సభ్యులు వాటిని పట్టించుకోకుండా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్కులో నిబంధనలు ఉల్లంఘించిన ప్రధాని రిషిపైనా.. ఆయన కుటుంబ సభ్యుల మీదా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అయితే.. ఈ తీరును బ్రిటన్ ప్రజలు తప్ప పడుతున్నారు. జరిగిన దానికి ఆయన క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. రెండు నెలల క్రితం కారులో సీటు బెల్టు పెట్టుకోకుండా వెళ్లినందుకు పోలీసులు ఫైన్ విధించటం తెలిసిందే. దేశ ప్రధాని కావటం గొప్ప కాదు. యావద్దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తూ..బాధ్యతగా వ్యవహరించే ప్రధానిగా గుర్తింపు పొందటం ముఖ్యమన్న విషయాన్ని రిషి సునాక్ ఎప్పటికి గుర్తిస్తారో?