టీపీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన రేవంత్…కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీపై ప్రశంసలు కురిపించారు. ఎంతమంది అడ్డుపడ్డా సోనియా తెలంగాణ ఇచ్చారని, తెలంగాణ తల్లి సోనియమ్మనే అని కొనియాడారు. ప్రతి ఇంట్లో సోనియా పటం ఉండాలని, తెలంగాణ ద్రోహులు మంత్రులయ్యారని విమర్శించారు.
పేదల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, మోదీ, కేసీఆర్ వల్ల పేదోడు బతికే పరిస్థితులు లేవని మండిపడ్డారు. కరోనా కంటే మోదీ, కేసీఆర్ ప్రమాదకరమని, మోదీ, కేసీఆర్ లను వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లు కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు ఉత్సాహంగా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ వచ్చాక ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదని, తెలంగాణకు పట్టిన చీడ కేసీఆర్ కుటుంబమని మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్ దోచుకుంటున్నాడని, తెలంగాణలో మారీచుడు, రావణాసురుడు కేసీఆర్ అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో తెలంగాణ తల్లీ బందీ అయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ని పెట్టుకోవాలని కొందరు సలహా ఇస్తున్నారని, పాదరసంలాంటి కార్యకర్తలే తమకు పీకేలని రేవంత్ అన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలే పీకేలు… ఏకే-47 తూటాలని అన్నారు. రేవంత్ మాట్లాడుతుండగానే కొందరు కార్యకర్తలు సీఎం రేవంత్ అంటూ నినాదాలు చేశారు. అయితే, వారందరినీ రేవంత్ సుతిమెత్తగా హెచ్చరించారు. ఇలా ఇప్పటి నుంచే నినాదాలు చేయడం వల్ల నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. తనను అభిమానించే వారు వ్యక్తిగతంగా నినాదాలు వద్దని, జై సోనియా, జై కాంగ్రెస్ అనే నినాదాలు మాత్రమే చేయాలని సూచించారు.