తొందరలో జరగబోయే ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ తరఫున ఇద్దరు ముఖ్యమంత్రులు స్టార్ క్యాంపెయినర్లు కాబోతున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఏపీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా తిప్పాలని ఇప్పటికే పార్టీ డిసైడ్ అయ్యింది. ఏపీ చీఫ్ షర్మిల ఢిల్లీ పర్యటనలో అగ్రనేత సోనియాగాంధీతో ఇదే విషయమై చర్చించారట. అందుకే సోనియా సానుకూలంగా స్పందించటమే కాకుండా ఇద్దరు ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడుతానని హామీ ఇచ్చారట.
షర్మిలను కూడా ఒకసారి ఇద్దరు సీఎంలతో చర్చించమని చెప్పారట. షర్మిలతో చెప్పటమే కాకుండా ఇదే విషయాన్ని రేవంత్, సిద్ధ రామయ్యలతో మాట్లాడారట. వాళ్ళు కూడా ఏపీలో ఎన్నికల ప్రచారం చేయటానికి రెడీగా ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇక్కడ విషయం ఏమిటంటే తెలంగాణా, కర్నాటకలో పార్లమెంటు ఎన్నికలు మాత్రం జరగబోతున్నాయి. కానీ ఏపీలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకనే ఏపీలో పార్టీ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేయటానికి ముఖ్యమంత్రులు ఇద్దరికీ వెసులుబాటు దొరికింది.
పార్లమెంటు తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండుంటే రేవంత్, సిద్ధరామయ్యలకు తమ రాష్ట్రాలను వదిలేసి ఏపీలో ప్రచారం చేయటం సాధ్యమయ్యేది కాదేమో. అందుకనే స్టార్ క్యాంపెయినర్ల హోదాలో ఇద్దరు సీఎంలతో ప్రచారం చేయించేందుకు పట్టుబట్టారు. తెలంగాణా, కర్ణాటక లో సీమాంధ్ర జనాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. కాబట్టే పై రెండు రాష్ట్రాల ప్రచారం ఏపీలో కూడా ప్రభావం చూపిస్తుందని ఏపీ కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. రాష్ట్రాలుగా వేర్వేరు అయినా రాజకీయంగా, బంధుత్వాల పరంగా, వ్యాపార, ఉద్యోగాల కారణంగా తెలంగాణా, కర్నాటకల మధ్య సీమాంధ్ర జనాల రాకపోకలు రెగ్యులర్ గా జరుగుతునే ఉంటాయి.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే రేవంత్, సిద్ధరామయ్యలతో ఏపీలో ప్రచారం చేయించాలని షర్మిల పట్టుబట్టింది. మరి రాజకీయంగా ఏపీలో వీళ్ళిద్దరి ప్రభావం ఎలాగుంటుందో ఇప్పటికైతే ఎవరికి తెలీదు. ఎందుకంటే గతంలో రేవంత్, సిద్ధరామయ్య ఏ హోదాలో కూడా ఏపీలో ప్రచారం చేసిందిలేదు. రేవంత్ అంటే ఏపీ జనాల్లో క్రేజుంది అన్నమాట వాస్తవమే. రేవంత్ మంచివక్త అన్న పేరుమాత్రం ఉంది. కాకపోతే పదేళ్ళుగా భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ పార్టీని లేపటానికి రేవంత్, సిద్ధరామయ్యలు ఎంతవరకు ఉపయోగపడతారో చూడాలి.