మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు చేసిన నుపుర్ పై పలు రాష్ట్రాలలో కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా నుపుర్ శర్మ వ్యాఖ్యలు దేశంలో అశాంతి రేపాయని, అందుకోసం ఆమె దేశానికి క్షమాపణలు చెప్పాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. అయితే, తాజాగా ఆ ఆదేశాలపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
నుపుర్ శర్మ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ లక్ష్మణ రేఖ దాటారని కొందరు మాజీ న్యాయమూర్తులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై వారు ఓ బహిరంగ లేఖను విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ఆ లేఖపై మాజీ న్యాయమూర్తులు, సాయుధ దళాల అధికారులు, బ్యూరోక్రాట్లు మొత్తంగా 117 మంది సంతకాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
దేశంలో అన్ని సంస్థలూ రాజ్యాంగం ప్రకారం బాధ్యతలు నిర్వహించినప్పుడే ప్రజాస్వామ్యం నిలిచి ఉంటుందని వారు అన్నారు. సుప్రీంకోర్టులో ఓ ద్విసభ్య ధర్మాసనానికి చెందిన ఇద్దరు జడ్జీలు చేసిన వ్యాఖ్యలు లక్ష్మణ రేఖ దాటినందునే తాము బహిరంగ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చిందని వారు అన్నారు. నుపుర్ శర్మకు న్యాయం నిరాకరించబడిందదని, దేశంలో జరిగిన దానికి ఆమెను మాత్రమే బాధ్యురాలని పేర్కొనడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఆ జడ్డిల వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలు, దేశ భద్రతపై తీవ్ర పరిణామాలు చూపిస్తాయని వారు అన్నారు. కాబట్టి, సత్వర దిద్దుబాటు చర్యలు అవసరమని సూచించారు.
దీంతో, సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై చర్చ నడుస్తోంది. నుపుర్ శర్మ విషయంలో ద్విసభ్య ధర్మాసనం చేసింది కరెక్టేనని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, నుపుర్ శర్మ మాదిరిగా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారందరితో క్షమాపణలు చెప్పించడం లేదు కదా అని అంటున్నారు. అయినా, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను మాజీ న్యాయమూర్తులు తప్పుబట్టడం ఏమిటని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.