రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును జగన్ సర్కార్ ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ప్రభుత్వం 2 సార్లు సస్పెన్షన్ వేటు వేసింది. 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి వరకు, 2022 జూన్ నుంచి 2024 మే వరకు ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. ఆ తర్వాత క్యాట్, సుప్రీం కోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేసి జగన్ ప్రభుత్వం తనపై కక్ష సాధించిందని నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు ఏపీ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.
ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ కు గురైన కాలాన్ని సర్వీసు కాలంగా పరిగణిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సస్పెన్షన్ కాలాన్ని చంద్రబాబు సర్కార్ రెగ్యులరైజ్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, సస్పెన్షన్ కాలానికి వేతనం, అలవెన్సుల చెల్లింపు కూడా చేయాలని ఆదేశించింది. సస్పెన్షన్ కాలం లెక్కించి ఆ సమయంలో ఆయన విధులు నిర్వర్తించినట్టు భావించి అంత మొత్తం ఏబీ వెంకటేశ్వరరావుకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇక, ఏబీ వెంకటేశ్వరావుపై జగన్ హయాంలో నమోదైన అభియోగాలను చంద్రబాబు సర్కార్ ఇటీవల వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, గత ఏడాది మే 31వ తేదీన ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు. ఆ రోజు ఉదయం ఆయనను సర్వీస్‌లోకి తీసుకోగా…సాయంత్రం పదవీ విరమణ చేశారు. చివరగా ఆయన ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా పోస్టింగ్ తీసుకున్నారు.