టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వరుసగా 9వ సారి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా…పార్టీ పెట్టి 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ప్లీనరీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ఈ ప్లీనరీకి టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. అయితే, అట్టహాసంగా నిర్వహించిన ఈ ప్లీనరీకి టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కవితతో పాటు టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు హాజరు కాకపోవడంపై చర్చ జరుగుతోంది.
కవిత, హరీష్ తో పాటు మరికొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు రాకపోవడానికి ప్రత్యేక కారణాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హరీష్ తోపాటు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉండడంతో వారు ప్లీనరీకి హాజరుకాలేదని చెబుతున్నారు. హరీష్ రావును ప్లీనరికీ రావొద్దని కేసీఆర్ చెప్పారని అంటున్నారు.
అందుకే, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయిన కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ హరీష్ ట్వీట్ చేశారని అంటున్నారు. ఇక, బతుకమ్మ సంబరాల కోసం కవిత దుబాయ్ వెళ్లినందున ఆమె రాలేకపోయారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కానీ, వీరిద్దరు ప్లీనరీకీ గైర్హాజరు కావడం వెనుక వేరే కారణాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్లీనరీకి రావాలని హరీష్ రావుకు ఆహ్వానం అందలేదని, అందుకే ఆయన రాలేదని పుకార్లు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా కేటీఆర్ విషయంలో హరీష్, కేసీఆర్ ల మధ్య ఉన్న గ్యాప్ వల్లే ప్లీనరీకి ఆయన రాలేదని అంటున్నారు.
అయితే, కవితకు మాత్రం ఎమ్మెల్సీ హోదాలో ఆహ్వానం ఉందని, కానీ, ఆమె హైదరాబాద్‌లో ఉండి కూడా ప్లీనరీకి కావాలని రాలేదని అంటున్నారు. కేటీఆర్‌తో ఉన్న అభిప్రాయభేదాల కారణంగానే కవిత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. రాఖీ పండుగ నాడు కూడా కేటీఆర్ కు కవిత రాఖీ కట్టలేదని గుర్తు చేస్తున్నారు. నమస్తే తెలంగాణలో కవితకు సరిగ్గా కవరేజీ కూడా రావడం లేదని, కేటీఆర్ కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి తనకు తక్కువ ప్రాధాన్యతనివ్వడం కూడా కవితకు నచ్చడం లేదని ప్రచారం జరుగుతోంది.