ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని, వ్యాక్సిన్ల కొనుగోలుపై సీఎం జగన్ ఆసక్తి చూపడం లేదని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విమర్ళలకు సమాధానం దాటవేసిన జగన్…ప్రతిగా కోవ్యాక్సిన్ ను ఏపీకి అమ్మడం లేదంటూ కుల ప్రస్తావన తెచ్చి అభాసుపాలయ్యారు. కోవ్యాక్సిన్ సంగతి పక్కనబెట్టి…కోవిషీల్డ్ ను కొనొచ్చుగా అన్న ప్రశ్నలకు జగన్ దగ్గర సమాధానం లేదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు సరిపడినన్ని వ్యాక్సిన్లు కొనేందుకు జగన్ ఆసక్తి చూపకపోవడానికి గల కారణమిదేనంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం కోట్ల రూపాయలు తగలేయడం దండగ అంటూ వైసీపీ ఎంపీ, డాక్టర్ సంజీవ్ కుమార్ గతంలో చేసిన వ్యాఖ్యలు వ్యాక్సిన్ పై జగన్ కు ఉన్న చిత్తశుద్ధిని బట్టబయలు చేశాయని నెటిజన్లు దుయ్యబడుతున్నారు.
యథారాజా తథా ప్రజ అన్న రీతిలో….జగన్ కు వ్యాక్సిన్ పై డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేదని, కాబట్టి ఆయన పార్టీకి చెందిన ఎంపీలు కూడా అదే మైండ్ సెట్ తో ఉన్నారని ఈ ఎంపీ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుంటే…ఏపీ సర్కార్ మాత్రం వ్యాక్సిన్ ను మొక్కుబడి ప్రక్రియగా చేయడంపై మండిపడుతున్నారు. ఈ కారణంతోనే జగన్ వ్యాక్సిన్లు కొనకుండా….విపక్షాలపై, వ్యాక్సిన్ కంపెనీలపై అర్థంపర్థంలేని ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అని ఫైర్ అవుతున్నారు.
ఈ ఏడాది మార్చిలో జరిగిన లోక్సభ సమావేశాల్లో జరిగిన ఆరోగ్య చర్చలో వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై నాడు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. కోవిడ్ టీకా కోసం రూ.35వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దండగని, ఈ టీకా 6 నుంచి 9 నెలల వరకు మాత్రమే యాంటీబాడీస్ ను వృద్ధిచేసి ప్రభావవంతంగా ఉంటుందని సంజీవ్ వ్యాఖ్యానించడం పెను దుమారం రేపింది.
వ్యాక్సిన్ కు బదులుగా ఆ డబ్బును దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనలో ఉపయోగించుకోవాలని కేంద్రానికి సంజీవ్ కుమార్ ఆనాడు ఉచిత సలహా కూడా ఇచ్చారు. తాను వృత్తిరీత్యా డాక్టర్ నని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని కూడా కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ లోక్ సభలో సెలవివ్వడం విశేషం.
కోవిడ్ -19 వంటి మహమ్మారి 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, కాబట్టి, దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్న రీతిలో ఈ వైసీపీ ఎంపీ మాట్లాడడంపై పలువురు వైద్య నిపుణులు మండిపడ్డారు. అయితే, డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు గత ఏప్రిల్లో కోవిడ్ -19 బారిన పడి కోలుకోవడం కొసమెరుపు.