మాస్ మహారాజ్ రవితేజ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. `ధమాకా`తో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ.. ఆ తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్, ఈగల్ చిత్రాలతో వరుస పరాజయాలను మూటగట్టుకున్నారు. ప్రస్తుతం రవితేజ `మాస్ జాతర` మూవీలో నటిస్తున్నారు. ఆయన కెరీర్ లో 75వ చిత్రమిది. రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరచయమవుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా అలరించబోతోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య మాస్ జాతర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 9న రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. అయితే విడుదల తేదీ మారే అవకాశాలు ఉన్నాయని జోరుగా టాక్ నడుస్తోంది. ఇందుకు కారణం చిరంజీవి నటించిన `విశ్వంభర`.
వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయబోతున్నారు. టాలీవుడ్ కు మే 9 అనేది లక్కీ డేట్. ఆ రోజు రిలీజ్ అయిన చిత్రాలన్ని బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకున్నాయి. అందుకే ఈ డేట్‌ని లాక్ చేసుకుంది విశ్వంభర టీమ్. దీంతో చిరంజీవి కోసం రవితేజ వెనక్కి తగ్గాలని భావిస్తున్నారట. చిరంజీవితో రవితేజకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇద్దరూ అన్నదమ్ముళ్ల ఉంటారు.
అన్నయ్యతో పోటీ పడటం ఇష్టం లేని రవితేజ.. తన సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవాలని అనుకుంటున్నారట. అయితే ఈగల్ మూవీ విషయంలోనూ ఇదే జరిగింది. ఈగల్ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ వెంకీ `సైంధవ్`, నాగార్జున `నా సామి రంగ`, తేజ సజ్జ `జై హనుమాన్` సినిమాలు సైతం సంక్రాంతి సీజన్ పై కర్చీఫ్ వేశాయి. థియేటర్ల వద్ద క్లాషెస్ వస్తాయని భావించిన నిర్మాతల మండలి.. రవితేజ సినిమాని వాయిదా వేసుకోవాల్సిందిగా కోరారు. దాంతో రవితేజ నటించిన ఈగల్ ఆఫ్ సీజన్ ఫిబ్రవరిలో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి ఉంటే మంచి వసూళ్లు సాధించి ఉండేది. రిలీజ్ వాయిదా వేసుకోవడం ఈగల్ విషయంలో చేసిన బిగ్ మిస్టేక్. ఇప్పుడు సేమ్ మిస్టేక్ `మాస్ జాతర` మూవీ విషయంలోనూ రిపీట్ అయ్యిందంటే రిజల్ట్ ఏమవుతుందో అని రవితేజ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.