రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో అన్నింటినీ ముఖ్యమనే పేర్కొంటున్నారు పాలకులు. ఇది గతంలో లేదు.. అది ఎవరూ అమలు చేయలేదు.. మేం మాత్రమే పెడుతున్నాం.. మా హయాంలోనే ఏపీ ముందుకు సాగుతోంది… అంటూ మాటల తూటాలతో ప్రకటనలు దంచికొడుతున్నారు. కానీ, వాస్తవాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి.
నాకైతే.. ఈ ముచ్చట వెనుక ఏదో దోపిడీ జరుగుతోందని అనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్.. పెడుతున్న పథకాల పరమార్థం.. ప్రజలకు చేరేదెంతో తెలీదుకానీ.. పార్టీ నాయకులకు, ఆయనకు బాగానే గిట్టుబాటు అవుతున్నట్టు అనిపిస్తోంది. రేషన్ సరుకులు.. ఇంటింటికీ పంపిణీ చేస్తామంటూ.. కొత్తగా 10 వేల వాహనాలు కొన్నారు.
ఈ బళ్లకి డ్రైవర్లను పెట్టారు. కానీ, అసలు రాష్ట్రంలో రేషన్ ఎన్ని రోజులు పంపిణీ చేస్తారు? నెల మొత్తం పంచుతారా? ఏంటి? నాకు తెలవక.. మా పొరుగునున్న మాస్టర్గారిని అడిగా! నెలలో మొదటి వారంలోనే పంచేస్తారని ఆయన చెప్పారు. మరి ఇంతోసి దానికి వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఎందుకు ఖర్చు చేస్తున్నారో.. నాకైతే.. అర్ధం కాలేదు. మేమైతే.. కుదిరినప్పుడు రేషన్ దుకాణం నుంచి సరుకులు తెచ్చుకునే వాళ్లం. అది కూడా మాకు ఖాళీ ఉన్నప్పుడు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. కానీ,ఇప్పుడు రేషన్ బళ్ల పేరుతో ప్రభుత్వం ఇంటికే తెచ్చిస్తానంటోంది. ఇక్కడే అనేక ప్రశ్నలు వస్తున్నాయి.. నా బోటి గాళ్లకు..
ఇంటి ముందుకు బండి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేకపోతే.. ఏం చేస్తారు? ఒకవేళ బండి వచ్చిన సమయంలో చేతిలో డబ్బులు లేకపోతే.. మళ్లీ వచ్చి ఇస్తారా? అయినా.. ఇదంతా ఎందుకు.. దుకాణాల్లో ఉంటే.. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్లెళ్లి తెచ్చుకుంటారు కదా? అంటే.. సమాధానం చెప్పేవారే లేరు. ఇక, ఈ బళ్ల పేరుతో ప్రజల సొమ్మును నీళ్ల మాదిరిగా ఖర్చు చేసేస్తున్నారు. వారం రోజుల పనికి నెల మొత్తం జీతాలు.. వారం రోజుల పంపిణీకి నెల మొత్తం బళ్లు.. ఈ యవ్వారమేందో.. ఈ కథేందో.. ఒక్కరికీ అర్దం కావట్టే!!
ఖర్చు చూస్తే.. తడిసిమోపెడు..
సంచులకు 700 కోట్లు…
వాహనాలు కొనేందుకు 530 కోట్లు…
బండికి రంగులు డ్రైవర్లకు జీతాల కోసం 800 కోట్లు
రేషన్ సరుకులకు 3 వేలకోట్లు
ఇక, వీటిని ఇంటికి చేర్చేందుకు మరో 2 వేల కోట్లు..
మరి ఇవన్నీ ఏమైనా.. జగన్ జేబులోంచి ఇస్తున్నారో ఏమో తెలియదు.. నెలనెల 3 వేల కోట్లతో అయ్యేదానికి.. ఇప్పుడు ఇంత ఖర్చు ఎందుకు? రూపాయి సంపద సృష్టించడం చేతకాదు. దివాళా తీసిన రాష్ట్రానికి ఇవన్నీ అవసరమా? అప్పులు చేసి ప్రజల నెత్తిన పన్నులు వెయ్యడం కాకపోతే.. అంటే అన్నానంటారు కానీ.. వెనకటికి మా వూళ్లో ఒక తింగరోడు ఉండేవోడు.. ఒరే నీకు ముక్కెక్కడుందిరా? అంటే.. ఆడు తలంతా తిప్పి తీసుకొచ్చి.. ఇదిగో అని ముందున్న ముక్కును చూపించినట్టుగా ఉంది.. జగన్ ఏలుబడి.. ఏం చేద్దాం.. ఓట్లేసినందుకు భరిద్దాం.. ఏమంటారు..
మీ..
నవ్య రెడ్డి, కర్నూలు
((పై పోస్టు ఒక నెటిజన్ ఆవేదన.. యతాతథంగా )