దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చిన హీరోల్లో రానా ఒకరు. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే నటుడిగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, వ్యాపారవేత్తగా రానా సత్తా చాటుతున్నాడు. అయితే వెండితెరపై రానా కనిపించి చాలా కాలం అయిపోయింది.
2022లో వచ్చిన 1945 మూవీ తర్వాత రానా నుంచి మరో చిత్రం రాలేదు. సినిమాల నుంచి దాదాపు రెండేళ్లు గ్యాప్ రావడంతో.. తాజాగా ఐఫా ఉత్సవ్ ప్రెస్ మీట్ లో రానా ని ఈ విషయంపై మీడియా ప్రశ్నించింది. దాంతో గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటో రానా వివరించారు. `కెరీర్ ఆరంభం నుంచి కొత్త సినిమాలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆ సినిమాలు మామూలు అయిపోయాయి. అందరూ చేస్తున్నారు.
అందుకే ఇంకా కొత్తగా ఏదైనా చేద్దామని వెతుకుతున్నా.. అలా సుమారు రెండేళ్లు గడిచిపోయింది. కావాలని గ్యాప్ తీసుకోలేదు. అదే వచ్చింది. త్వరలోనే కొత్త సినిమాను ప్రకటిస్తా` అంటూ రానా చెప్పుకొచ్చాడు. ఇక ఇదే ప్రెస్ మీట్ లో కల్కి 2898 ఏడీ సక్సెస్ పై రానా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. విడుదలకు ముందే కల్కి గొప్పగా ఉంటుందని నమ్మాను.. అందరి ఊహలకు మించి విజయాన్ని అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ రానా చెప్పుకొచ్చాడు. కాగా, రానా ప్రస్తుతం తమిళంలో టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెట్టయన్ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు.