మార్గదర్శి చిట్ఫండ్ ను జగన్ ప్రభుత్వం మరోసారి టార్గెట్ చేసింది. చిట్ఫండ్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆ సంస్థ కార్యాలయాల్లో రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. మార్గదర్శి ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో కేసు వేసిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి నగదు డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణలతో దాఖలు చేసిన ఈ పిటిషన్ పై తొలుత హైకోర్టులో విచారణ జరిగింది.
సుదీర్ఘకాలం తర్వాత ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఇటీవల ఇంప్లీడ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ స్టాంప్స్-రిజిస్ట్రేషన్ శాఖ వరుస సోదాలు జరపడం గమనార్హం. చిట్ ఫండ్ చట్టం-1962 కింద నమోదైన కంపెనీల చిట్ వసూళ్లు, నగదు లావాదేవీలపై నిఘా పెట్టారు. చిట్ ఫండేతర పనులకు నగదు బదలాయింపు చేస్తున్నారు కాబట్టి వాటిపై పూర్తి నిఘా పెట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. ఈ చట్టం కింద చిట్ ఫండేతర కార్యకలాపాల నిర్వహణ, నగదు సమీకరణ, అప్పులివ్వడం, డిపాజిట్ల సేకరణ చేస్తున్నారా లేదా గుర్తిస్తున్నారు.
చట్టప్రకారం వ్యాపారానికి సంబంధించి అకౌంట్లు, రిజిస్టర్లు నిర్వహించడం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఇది తీవ్రమైన ఉల్లంఘనగా భావించాలని అధికారులకు తేల్చిచెప్పింది. చిట్ పాడుకున్నవారికి వెంటనే నగదు చెల్లించడం లేదని, రశీదులు, బిల్లులు ఇవ్వడం లేదని, బ్యాంకు ఖాతాల నిర్వహణ బాగోలేదని, నేరుగా నగదు చెల్లింపులు చేస్తున్నారని, ఇవి ఐటీ చట్టం ఉల్లంఘన కిందకు వస్తున్నాయి కాబట్టి ఈ కేసుల్లో తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
2019-20, 20–21, 21-22 సంవత్సరాల చిట్ ఫండ్ కార్యకలాపాల రిజిస్టర్లు, ఆకౌంట్ బుక్ లు, బ్యాలెన్స్ వివరాలను నిశితంగా పరిశీలించినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి తీసుకున్న అనుమతులను కూడా పరిశీలించారు. నిపుణులతో శిక్షణ. మార్గదర్శిలో సోదాలకు వెళ్లే బృందాలకు మూడ్రోజుల ముందే శిక్షణ ఇచ్చినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది.
సోదాల అనంతరం రిజిస్ట్రార్ ఆఫ్ బిట్స్, స్టాంప్స్-రిజిస్ట్రేషన్ ఐజీ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 చిట్ ఫండ్ కంపెనీల కార్యాలయాల్లో తనిఖీలు చేశామని వెల్లడించారు. 2021-22 సంవత్సర బ్యాలెన్స్ రికార్డులను పరిశీలించినప్పుడు నిధులను మళ్లించినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ఇంకా అడ్వాన్స్ చండాలను వసూలు చేస్తున్నట్లు, అపరాధ రుసుము వసూలుపై జీఎస్టీ చెల్లించకపోవడం మొదలైనవి గుర్తించామన్నారు.