బీఆర్ఎస్ అధినేత కేసీయార్ పై ఒత్తిడి పెరిగిపోతోందట. ఎందుకంటే రాజ్యసభ ఎంపీగా ఎవరికి అవకాశం వస్తుందో అనే చర్చ పార్టీలో బాగా పెరిగిపోతోంది. ఏప్రిల్ 2వ తేదీతో తెలంగాణాలోని ముగ్గురు ఎంపీల పదవీ కాలం పూర్తయిపోతోంది. రిటైర్ అవబోయే ముగ్గురు ఎంపీలు ఇపుడు బీఆర్ఎస్ వాళ్ళే. సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య, వద్దిరాజు రవిచంద్ర రిటైర్ అవుతున్నారు. వీళ్ళ ప్లేసును భర్తీ చేయటానికి కేసీయార్ కు ఒక అవకాశం మాత్రమే ఉంది. అందుకనే పార్టీ నేతలతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖుల నుండి ఒత్తిడి పెరిగిపోతోందట.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 ఎంఎల్ఏలను మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. గెలిచిన ఎంఎల్ఏల ఆధారంగా బీఆర్ఎస్ కు ఒక్కస్ధానం మాత్రమే దక్కుతుంది. అందుకనే ఆ ఒక్కస్ధానాన్ని దక్కించుకునేందుకు చాలామంది నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే అవకాశం కోసం కేసీయార్ పైన బాగా ఒత్తిడి పెంచేస్తున్నట్లు పార్టీవర్గాల టాక్. పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే సంతోష్ కుమార్ కు మళ్ళీ ఛాన్స్ లేదట. అలాగే లింగయ్యకు కూడా రెండోసారి అవకాశం దక్కకపోవచ్చనే అంటున్నారు. మిగిలిన రవిచంద్రకు మాత్రం అవకాశం కొంచెం ఉందట.
ఎలాగంటే సంతోష్ కుమార్, లింగయ్య ఆరు ఏళ్ళ పూర్తికాలం ఎంపీలుగా ఉన్నారు. రవిచంద్ర మాత్రం రెండు సంవత్సరాలే ఉన్నారు. నాలుగేళ్ళ తర్వాత ఖాళీ అయిన స్ధానంలో రవికి అవకాశం దక్కటంతో పదవీకాలం రెండేళ్ళు మాత్రమే దక్కించుకున్నారు. ఇపుడు ఆ రెండేళ్ళు కూడా పూర్తయిపోతోంది. అప్పట్లో రవిచంద్రకు ఎంపీగా అవకాశం ఇచ్చేటపుడే కేసీయార్ రెన్యువల్ అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆ హామీతోనే రవి అప్పట్లో రెండేళ్ళ పదవీకాలం ఉన్న ఎంపీగా బాధ్యతలు తీసుకున్నారట.
కాబట్టి అప్పట్లో ఇచ్చిన హామీ ప్రకారం రవిచంద్రకు పూర్తిస్ధాయి ఎంపీగా బాధ్యతలు నిర్వహించే అవకాశం కేసీయార్ ఇవ్వబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన రవిచంద్ర మొదటినుండి గ్రానైట్ వ్యాపారి. ఆర్ధికంగా పార్టీకి అండదండలు అందిచారనే ప్రచారం ఉంది. కాబట్టి రవిచంద్రకే ఒక్కస్ధానం దక్కుతుందనే వాదన పార్టీలో బాగా వినిపిస్తోంది. ఏమో కేసీయార్ ఎప్పుడేమి ఆలోచిస్తారో తెలీదు కాబట్టి సడెన్ గా కొత్త అభ్యర్ధిని ఎంపికచేసినా చేయచ్చనే మాట కూడా వినబడుతోంది. మరి ఏమవుతుందో చూడాలి.