తమిళ సూపర్ స్టార్ కమ్ తలైవా రజనీకాంత్ మరోసారి స్పష్టం చేసేశారు. తాను రాజకీయాల్లోకి రానని చెప్పిన తర్వాత.. పదే పదే రమ్మని కోరొద్దంటున్నారు. రాజకీయాల్లోకి వస్తానని చెప్పటమేకాదు.. తమిళనాడును మార్చాలంటే ఇప్పుడే. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పటికి కాదన్న సినిమాటిక్ డైలాగ్ చెప్పి.. రాజకీయ పార్టీని పెట్టనున్నట్లుగా చెప్పి అభిమానులకు పండుగ లాంటి మాట చెప్పారు. అంతలోనే.. వెనక్కి తగ్గి ఇప్పుడు రాజకీయాల్లోకి రానంటే రానని చెబుతున్నారు.
అదేంటి? మీరు రాజకీయాల్లోకి రాకపోతే ఎలా అంటూ రజనీ అభిమానులు రోడ్ల మీదకు వచ్చారు. నిరసనలు చేస్తున్నారు.. ధర్నాలు నిర్వహిస్తున్నారు. .ఇలాంటివేళ.. రజనీకాంత్ తన అభిమానులకు ఒక లేఖ రాశారు. తాను రాజకీయాల్లోకి రాలేకపోవటానికి కారణాలు సవివరంగా చెప్పిన తర్వాత కూడా తనను రాజకీయాల్లోకి రమ్మనటం అంటే.. తనను బాధ పెట్టినట్లే అంటూ సెంటిమెంట్ కత్తి బయటకు తీశారు.
ఆరోగ్య పరిస్థితుల కారణంగా రాజకీయాల్లోకి రానని చెప్పానని.. తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఒత్తిడి చేయొద్దని కోరిన రజనీ.. ట్విటర్ లో తన భావోద్వేగ లేఖను పోస్టు చేశారు. ‘రాజకీయాల్లోకి రాలేకపోవటానికి కారణాల్ని వివరంగా చెప్పా. నిర్ణయాన్ని మార్చుకోమని ఒత్తిడి చేయొద్దు. బాధకు గురి చేయొద్దు’ అని కోరారు. అభిమానుల ప్రవర్తన కారణంగా తాను తీవ్రంగా కలత చెందినట్లుగా పేర్కొన్న రజనీ.. తనను అర్థం చేసుకొని ఆందోళన చేయకండన్నారు. మరి.. రజనీ కోరుకున్నట్లే అభిమానులు తమ ఆందోళనకు తెర దించుతారా? మరిన్నిసార్లు అడిగి.. మరింతగా బాధ పెడతారో చూడాలి. అయినా.. రజనీ అంతలా అడుగుతున్నప్పుడు.. రాజకీయాల్లోకి రండి సార్ అంటూ అడగటం ఇక అనవసరమేనని చెప్పాలి.