కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ దేశానికి తదుపరి ప్రధాని అవుతారని ఓ స్వామీజీ జోస్యం చెప్పారు. నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారని.. ఇప్పుడు రాహుల్ కూడా అవుతారని అన్నారు హవేరీ హోసమఠ్ స్వామీజి. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ ట్విట్టర్లో వెల్లడించారు. రాహుల్ గాంధీ.. కర్ణాటక చిత్రదుర్గలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్ను సందర్శించారు. మఠాధిపతి డా. శ్రీ శివమూర్తి మురుగ రాజేంద్ర శరణరు నుంచి ఆయన ‘ఇష్టలింగ దీక్ష’ను స్వీకరించారు.
సాధారణంగా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు.. ఈ ఆచారాన్ని పాటిస్తారు. స్వామి బసవన్న బోధనలు ఎప్పటికీ నిలిచి పోతాయని, వాటి గురించి తాను తెలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు రాహుల్. మఠాన్ని సందర్శించిన రాహుల్ వెంట కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఉన్నారు.
అయితే.. ఈ క్రమంలోనే రాహుల్పై స్వామీజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ”ఇందిరా గాంధీ ప్రధానిగా పనిచేశారు. రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. ఇప్పుడు రాహుల్ గాంధీ లింగాయత్ శాఖలోకి ప్రవేశించారు కాబట్టి.. ఈయన కూడా ప్రధాని అవుతారు.“ అన్నారు.
అయితే ఇంతలోనే జోక్యం చేసుకున్న మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుగ శరణరు.. అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్వామీజీని అడ్డుకున్నారు. ఇది రాజకీయ వేదిక కాదని.. ప్రజలే దానిని నిర్ణయిస్తారని చెప్పారు.