నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సికింద్రాబాద్లోని తిరుమలగిరి ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఆర్మీ ఆస్పత్రిలో హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి, తెలంగాణ హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రార్ డి.నాగార్జున పర్యవేక్షణలో వైద్య పరీక్షలు రెండోరోజు కూడా కొనసాగుతున్నాయి. ఆర్మీ హాస్పిటల్కు చెందిన ముగ్గురు వైద్య అధికారుల మెడికల్ బోర్డు రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించింది.
ఆర్మీ ఆస్పత్రిలోని వీఐపీ రూంలో రెండో రోజు పరీక్షల్లో రఘురామ బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్లు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. నడవలేక పోవడానికిగల కారణాలు, దీంతోపాటు రఘురామకున్న ఆరోగ్య సమస్యలను వైద్యులు అడిగి తెలుసుకుంటున్నారని తెలుస్తోంది. రఘురామ చెప్పిన సమస్యలపై వైద్యలు పరీక్షలు నిర్వహించనున్నారు.
సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలిచ్చే వరకు రఘురామ ఆర్మీ ఆస్పత్రిలో జ్యడిషియల్ కస్టడీలో ఉంటారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఆర్మీ వైద్యులు తెలిపారు. రెండో రోజు కూడా ఆర్మీ పోలీసులు వాహనాలు తనిఖీలు చేసి, అనుమతి ఉన్నవారికి మాత్రమే లోపలకి పంపిస్తున్నారు. మీడియాను ఆసుపత్రికి 500 మీటర్ల దూరంలో నిలిపివేశారు.
అంతకుముందు, రఘురామకు అయిన గాయాలపై తొలిరోజు వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టుకు తెలంగాణ హైకోర్టు పంపించింది. రఘురామకు రక్తం, చర్మ సంబంధిత పరీక్షలు నిర్వహించినట్లు ఆర్మీ వైద్యులు నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సీల్డ్ కవర్లో పంపిన నివేదిక, వీడియోను శుక్రవారంనాడు సుప్రీం కోర్టు పరిశీలించనుందని తెలుస్తోంది.