తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితుల విచారణ సందర్భంగా వారు పలువురి పేర్లు వెల్లడించడం సంచలనం రేపింది. ఆ నిందితులు చెప్పిన సమాచారం ఆధారంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ , మరికొందరికి సిట్ అధికారులు నోటీసులిచ్చారు. దీంతో, ఆ ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ తో రఘురామకు కూడా సంబంధం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై రఘురామ స్పందించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే పనికిమాలిన ఆలోచనలు తనకు ఎందుకు వస్తాయని రఘురా ప్రశ్నించారు. హైదరాబాద్ ను సీఎం కేసీఆర్ అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతున్నారని, తెలంగాణలో అభివృద్ధి చూసి ఏపీ ప్రజలు ఇక్కడకు వలస వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని గతంలోనే తాను అనేక సార్లు చెప్పానని, అటువంటిది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలన్న ఆలోచన ఎందుకు చేస్తానని అన్నారు.
తెలంగాణను డెవలప్ చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి హాని తలపెట్టాలన్న ఆలోచన తనకు లేదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏనాడూ తాను మాట్లాడలేదని గుర్తు చేశారు. కేసీఆర్ కు కీడు తలపెట్టాలన్న ఆలోచన కలలో కూడా చేయలేదని వివరణనిచ్చారు. తెలంగాణలో పనిచేస్తూ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు ఎవరో గుర్తించాలని కేసీఆర్ కు రఘురాజు సలహానిచ్చారు.
జగన్ తన మాట వినే కొందరు అధికారులతో ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. జగన్ తో తనకు గొడవ ఉందని… కేసీఆర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. తెలంగాణ సిట్ తనకు సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చిందని, తాను వాటికి సమాధానం ఇస్తానని అన్నారు.