తన సొంత నియోజకవర్గం లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని హాజరైన సందర్భంగా, నియోజకవర్గానికి వెళ్లేందుకు ప్రయత్నించిన తనని, రైలు భోగి దగ్ధం చేసి హతమార్చాలని చూశారని, అలాగే పలుమార్లు తనపై జరిగిన హత్యాయత్నం, సిఐడి కస్టడీలో తనని చిత్రహింసలకు గురిచేసిన విధానాన్ని వివరిస్తూ గతంలో సహచర ఎంపీలకు, కేంద్ర మంత్రులకు తాను లేఖలు రాశానన్నారు.
వారిలో సుమారు 60 నుంచి 70 మంది ఎంపీలు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి రఘురామకృష్ణం రాజుకు ప్రాణహాని ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధానికి విన్నవించారని, అలాగే తనకు తెలిసిన మేరకు ఏడుగురు కేంద్ర మంత్రులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు.
హింసే మా ఆయుధం, హింసే మా మార్గం అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. గాంధీ పేరు పెట్టుకుని గాందేయ మార్గంలో నడిచే, చెన్నుపాటి గాంధీ పై విజయవాడలో తమ పార్టీ నాయకులు దాడి చేసి కన్ను పెరికేయాలని చూశారని ఆందోళన వ్యక్తం చేశారు.
గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించిన మన పాలకులు, కన్ను బాగాలేదని , కన్ను పొడుచుకున్నాడని కహానీలు చెప్పగలరని ఎద్దేవా చేశారు. సిఐడి కస్టడీలో తనని కాళ్లు కట్టేసి కొట్టడమే కాకుండా, ఆ సంఘటనను ఒక సీనియర్ పోలీసు అధికారి చిత్రీకరిస్తే, ఆ వీడియోను రాష్ట్ర ముఖ్య నేత చూసి ఆనందించిన వ్యవస్థలో మనం ఉన్నామన్నారు. మళ్లీ వీరే సుప్రీంకోర్టులో పచ్చి అబద్దాలను చెప్పారని, తన కాళ్లు తానే కట్టేసుకొని, తన కాళ్లపై తానే కొట్టుకున్నట్లుగా అబద్దాలను చెప్పారన్నారు. ఇవన్నీ సంఘటనలు చూస్తుంటే బాబాయిని మీరే వేశారనడంలో డౌట్ లేదురా అబ్బాయని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.
గుండెపోటు తట్టుకోలేక గొడ్డలితో పొడుచుకొని వైఎస్ వివేకానంద రెడ్డి, సిఐడి కస్టడీలో తన కాళ్లను తానే కట్టేసి కొట్టేసుకున్నట్లుగా, కన్ను నొప్పి తట్టుకోలేక గాంధీ తన కన్ను తానే పెరికేసుకున్నట్లుగా అబద్దాలను ప్రభువుల మెప్పు కోసం పోలీసులు చెబుతారన్నారు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఏమి చేయగలవని, రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు ఈ దరిద్రాన్ని, దందాను భరిస్తూ, ఎన్నాళ్లు ఓపికగా ఉంటారో చూడాలన్నారు. ఓపిక కట్టలు తెంచుకుంటే, ఏ లెవెల్ కైనా వెళ్తుందన్నారు. జనాలను చంపేసి, ఎంపీని చంపేయాలని చూసే ఈ దురాగతాలు ఇంకెన్నాళ్లని ప్రశ్నించారు. తాను ప్రయాణిస్తున్న రైలు బోగీని దహనం చేసి హతమార్చాలని చూశారని, దానికి ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
మనకు పెట్టే మనసు లేదు… కొట్టే, కొట్టేసే మనసు మాత్రమే ఉంది
మనకు అన్నం పెట్టే మనసు లేదని, ఇతరులను కొట్టి, కొట్టేసే మనసు మాత్రమే ఉందని పరోక్షంగా పాలకులను ఉద్దేశించి రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టరు… అన్నం పెట్టే వారిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళగిరి, కుప్పంలలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే, వాటిని ధ్వంసం చేయడమే కాకుండా, అడ్డుకునే ప్రయత్నం చేసిన వారి తలలను బద్దలు కొట్టారని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.
12 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను కాదని డీజీపీ పదవీ కట్టబెట్టినందుకు రాజేంద్రనాథ్ రెడ్డి గతంలో తనకున్న మంచి పేరును సైతం కాదనుకొని, బాధితులపైనే తిరిగి కేసులో పెడుతున్నారన్న ఆయన, వీళ్ళ మన పోలీసులు అంటూ ప్రశ్నించారు. తెనాలిలోనూ అన్నం పెట్టే వారిపై కేసులు పెట్టి, అన్నం తినడానికి వచ్చిన వారిని తరిమికొట్టి, అన్నాన్ని నేలపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆకలితో ఉన్న వారిని, అన్నాన్ని గౌరవించాలని పాలకులకు సూచించారు. ఇకనైనా మీ అరాచకాలను, అకృత్యాలను ఆపాలని క్రూరడైన ఈ రాష్ట్ర ముఖ్య నేతకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. పోలీసు లారా… మీరు ఎవరిని కాపాడవలసిన పనిలేదు… ఎవరిని కూడా హింసించకపోతే చాలు అని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు, త్వరలోనే ప్రభుత్వం మారనుందని, ప్రభుత్వం మారినప్పుడు నిబంధనలను గాలికి వదిలి వ్యవహరించిన పోలీసు అధికారులకు తిప్పలు తప్పవని హెచ్చరించారు.
శాంతి భద్రత ఇలాగే ఉంటే రాష్ట్రపతి పాలన కోరుతా
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రాష్ట్రపతిని కలిసి … రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు అదుపు తప్పాయని, ఎక్కడ చూసినా హింసే రాజ్యమేలుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
విజయవాడలో స్కూటీపై వెళ్తున్న చెన్నుపాటి గాంధీ పై హత్యాయత్నం, ప్రతిపక్ష నేతను సొంత నియోజకవర్గంలోనే అడ్డుకోవడం, ఒక ఎంపీగా తనని తన నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా, కేసులు నమోదు చేయడం వంటి సంఘటనలను పరిశీలిస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటో అర్థం అవుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.
న్యాయస్థానాలకు ఎవరు అతీతులు కాదు…
న్యాయస్థానాలకు అతీతులు ఎవరూ కాదని, మన రాజ్యాంగంలోనే అలా రాసుకున్నామని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటును ఎవరూ ఆపలేరని అమాత్యులు గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ తో పాటు పలువురు మాట్లాడడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు తీర్పు చెప్పిన తర్వాత, మాట్లాడడానికి మీరు ఎవరు అంటూ ప్రశ్నించారు.
న్యాయస్థానాల తీర్పుకు అందరూ బద్దులేనన్న ఆయన, న్యాయస్థానాలకు ఎవరు అతీతులు కాదని చెప్పారు. న్యాయస్థానాలు శిక్షిస్తే జైలుకు వెళ్ళవలసిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మంత్రులు, అవగాహన ఉండి మాట్లాడుతున్నారో, లేకుండా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్న ఆయన, న్యాయస్థానాల తీర్పును గౌరవించవలసిన అవసరం లేదని వారి భావన అంటూ ప్రశ్నించారు.
మూడు రాజధానుల ఏర్పాటు పై అసెంబ్లీ తీర్మానం చెల్లదు… బాబాయి అంటూ కోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. అమరావతి నుంచి విశాఖకు వెళ్లిపోవాలని తొందరలో, ఋషికొండను చదును చేసి అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి మిగిలిన 13 నుంచి 15 నెలల కాల వ్యవధిలో ఋషికొండపై భవననిర్మాణాలను పూర్తి చేయలేదని చెప్పారు.
హైకోర్టులో ఈ కేసు విచారణ ఆలస్యం అయితే, రుషికొండ ప్రకృతి విద్వాంసాన్ని సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశం తమకు ఉన్నదని గుర్తు చేశారు. కోర్టు ధిక్కరణ కింద సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఋషికొండపై చేపడుతున్న నిర్మాణాలకు సి ఆర్ జెడ్ అనుమతులు, అగ్నిమాపక దళ అనుమతులు లేవని, కనీస అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా, విశృంఖలంగా నిర్మాణాలను చేపడుతున్నారని చెప్పారు.
సోమవారం నాడు ఋషికొండపై జరుగుతున్న ప్రకృతి విధ్వంసానికి సంబంధించిన కేసు విచారణకు రానుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. పర్యావరణాన్ని ప్రేమించాలని, ప్లాస్టిక్ ని నిరోధించాలని కబుర్లు చెబుతున్న పర్యావరణ ప్రేమికుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి , ఋషికొండపై ప్రజల కళ్ళ ఎదురుగానే చేస్తున్న దారుణమైన ప్రకృతి విధ్వంసాన్ని ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని కోరారు.
ఋషికొండపై జరుగుతున్న ప్రకృతి విధ్వంసానికి సంబంధించి తాను సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టులో ఉన్న కేసులో ఇంప్లిడ్ కావాలని సూచించినట్లు తెలిపారు. తన తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర, ఋషికొండ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లగా అనుమతి లేదని నిరాకరించారని వెల్లడించారు. ఏపీ టూరిజం శాఖ కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు.
ఋషికొండ ఏమైనా శ్రీహరికోటా?, రాకెట్ రహస్యాలను ఏమైనా చేదిస్తున్నామా అని ప్రశ్నించిన ఆయన, ఋషికొండ రాజకోట రహస్యంగా, గండికోట రహస్యంగా మారిందని ఎద్దేవా చేశారు. శాటిలైట్ చిత్రాల ద్వారా ఋషికొండపై జరుగుతున్న ప్రకృతి విధ్వంసం గురించి ప్రముఖ దినపత్రికలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కథనాలను ప్రచూరించాయని తెలిపారు.
ఇప్పటికే కోర్టు దృష్టికి శాటిలైట్ చిత్రాలను తీసుకువెళ్లామని, తీసుకువెళ్తామని చెప్పారు. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్దాలను చెప్పిందని, గతంలో ఉన్న పర్యాటక కాటేజీల స్థానంలోనే, ప్రస్తుతం భవనాలను నిర్మిస్తున్నామని చెప్పి, ఋషికొండకు గుండు కొట్టారన్నారు. పర్యాటక శాఖ వద్ద డబ్బులే లేవన్న ఆయన, మిలియన్ల ఎస్ ఎఫ్ టి లలో భవన నిర్మాణాలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 100 కోట్ల రూపాయలు దాటితే రివర్స్ టెండరింగ్ అన్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు వందల కోట్ల రూపాయలను వెచ్చించి భవన నిర్మాణాలను ఎలా చేపడుతుందంటూ నిలదీశారు.
న్యాయస్థానాలంటే తమ ప్రభుత్వానికి లెక్కే లేదని… అంతులేని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. చట్టానికి కళ్ళు లేవన్నది నిజమేనని కానీ చెవులు ఉన్నాయన్న రఘురామకృష్ణం రాజు, కళ్ళున్న ప్రజలు, చట్టాన్ని గౌరవించే ప్రజలతో కలిసి ఋషి కొండపై జరిగిన ప్రకృతి విధ్వంసాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఋషికొండపై నిర్మించేవి టూరిజం బిల్డింగులు కానే కాదు… అమరావతి నుంచి జెండా లేపి, విశాఖలో పాతేద్దామనుకుంటున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాస, ఆఫీస్ భవనాలని అన్నారు.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మూడేళ్లయిన అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయలేదని, అధికారంలోకి వచ్చాక తామే నిర్మాణాన్ని పూర్తి చేస్తామని గమ్మత్తుగా చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, మూడేళ్లయిన 80 నుంచి 90 శాతం పూర్తయిన భవన నిర్మాణాలను ఎందుకని పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఆరు నెలల సమయాన్ని న్యాయస్థానం ఇస్తే, ఆరు నెలలు కాదని, 60 నెలల సమయం కావాలని అడగడం… కోర్టును అవమానించడమేనని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
టూరిజం శాఖ పేరిట విశాఖలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్మించుకోవాలని భావిస్తున్న కలల సౌధాన్ని న్యాయబద్ధమైన పోరాటం ద్వారా అడ్డుకొని తీరుతామని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఋషికొండపై ప్రకృతి విధ్వంసాన్ని ఇలాగే కొనసాగనిస్తే, దానికి అంతులేకుండా పోతుందని ప్రకృతి, పర్యావరణ ప్రేమికులైన ప్రజలందరూ గమనించాలని కోరారు.