ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎంపీ.. రఘురామకృష్ణరాజు.. ఇటీవల కాలంలో సీఎం జగన్ కు లేఖలు రాస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలు.. ఇంకా నెరవేరకపోవడంపై రఘురామ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ పరంపరలోనే తాజాగా ఆయన మరో లేఖ సంధించారు. అయితే.. ఈ లేఖలో ప్రజలకు జగన్ ఇచ్చిన హామీల గురించి కాకుండా.. పార్టీ పరంగా.. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వాధినేతగా అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించింది కావడం గమనార్హం.
విషయం ఇదీ..
తాజాగా రాసిన లేఖలో రఘురామ.. సీఎం జగన్ను సూటిగా ప్రశ్నించారు. గత ఏడాది మూడు రాజధానుల ఏర్పాటు, ఏపీ సీఆర్ డీఏ చట్టాలను రద్దు చేస్తూ.. జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని అసెంబ్లీలో సంఖ్యాబలం ఉన్న కారణంగా దిగువ సభలో వీటిని ఆమోదించినా.. పెద్దల సభ శాసన మండలిలో మాత్రం సఖ్యాబలం ఎక్కువగా ఉన్న టీడీపీ ప్రజాభ్యున్నతి కోణంలో ఆలోచించి అడ్డుకుంది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జగన్.. రాత్రికిరాత్రి మండలి రద్దుకు ప్రతిపాదించారు. ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపారు. కేంద్రం ఆమోదిస్తే.. మండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మండలి విషయంపై అధికార-ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధానికి దారితీసింది.
ఇదిలావుంటే.. ఇప్పటికీ మండలి రద్దు కాలేదు. ఈ మధ్యలో అనేక మార్లు జగన్.. ఢిల్లీకి వెళ్లినా.. మండలి రద్దుపై మాత్రం ప్రస్తావించడం లేదు. దీనికి కారణం.. రోజులు గడిచే కొద్దీ.. మండలిలో టీడీపీ సంఖ్యాబలం తగ్గిపోయి.. వైసీపీకి పెరుగుతుండడమే. ప్రస్తుతం వైసీపీ మెజారిటీ పొజిషన్ లోకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో మండలి రద్దు కోరుతూ.. అసెంబ్లీ చేసిన తీర్మానం.. సహా.. రద్దు చేయడం మంచిదని సూచిస్తూ.. రఘురామ తాజాగా లేఖ రాశారు.
శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్కు రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు. మెజార్టీ ఉన్నప్పుడు మండలి రద్దు చేస్తే చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారన్నారు. మెజార్టీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తింద న్నారు. మండలిలో మెజార్టీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో మీ గౌరవం పెరుగుతుందని రఘురామ పేర్కొన్నారు.
మండలి కొనసాగించడం వృథా అవుతుందని జగన్ చెప్పిన మాటలను నమ్మాలంటే.. తక్షణమే మండలిని రద్దు చేయాలని పేర్కొన్నారు. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా మండలి రద్దుకు పార్లమెంట్లో ప్రయత్నిస్తానన్నారు. జగన్ విలాసాలకు 26 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని గిట్టనివారు చెబుతున్నారని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ నేతలకు ఏం చెప్పాలో.. ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు.