నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటిదాకా ఈ వ్యవహారం రాజకీయ నాయకుల మధ్యే కొనసాగగా… ఇప్పుడు ఈ వివాదంలోకి ఏకంగా ఆర్మీ ఆసుపత్రికి చెందిన ఓ ఉన్నతాధికారి కూడా వచ్చి చేరారు. ఈ మేరకు స్వయంగా రఘురామరాజే… కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి మరీ సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
సుప్రీంకోర్టు తనకు బెయిల్ మంజూరు చేసిన తర్వాత కూడా తనను సీఐడీ కస్టడీకి పంపేలా ఓ కుట్ర జరిగిందని, ఆ కుట్రకు కేపీ రెడ్డి కూడా సహకరించారని సదరు ఫిర్యాదులో రఘురామరాజు ఆరోపించారు. ఈ వ్యవహారం ఇప్పుడు పెను కలకలమే రేపుతోంది.
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ టికెట్ పైనే నరసాపురం లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన రఘురామరాజు… ఆ తర్వాత వైసీపీకి దూరంగా జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ సహా కేంద్ర కేబినెట్ లోని పలువురు మంత్రులను ఒంటరిగానే కలుస్తూ వైసీపీ శిబిరంలో ఆందోళన రేకెత్తించిన రఘురామరాజు.. తదనంతర పరిణామాల్లో వైసీపీకి పక్కలో బల్లెం మాదిరిగానే మారిపోయారు.
ఈ క్రమంలో సీఎం జగన్ తో పాటు జగన్ సర్కారు తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలపై తననదైన శైలిలో విమర్శలు గుప్పించిన రఘురామరాజు.. వైసీపీకి అసలు సిసలు వైరి వర్గంగా మారిపోయారన్న వాదనలూ వినిపించాయి.ఈ క్రమంలో సరిగ్గా రఘురామరాజు బర్త్ డే నాడు హైదరాబాద్ లోని ఆయన ఇంటిలోనే ఆయనను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆపై తనను సీఐడీ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామరాజు ఆరోపించడం తెలిసిందే.
ఈ మొత్తం వ్యవహారం పలు మలుపులు తిరిగి చివరకు రఘురామకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేయడం, ఆపై ఆయన ఆర్మీ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి నేరుగా ఢిల్లీకి వెళ్లడం చకచకా జరిగిపోయాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడకుండానే సైలెంట్ గా ఉంటున్న రఘురామరాజు… తనదైన శైలి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వద్దకు వీల్ చెయిర్ లో వెళ్లిన రఘురామరాజు… ఆయనకు ఓ మూడు పేజీల లేఖను అందజేశారు. అంతేకాకుండా తనపై జరుగుతున్న కుట్రను కూడా వివరించారు. ఈ సందర్భంగా ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే… తనను ఆర్మీ ఆసుపత్రి నుంచి త్వరగా డిశ్చార్జి చేసేందుకు వైద్యులపై కేపీ రెడ్డి ఒత్తిడి తెచ్చారని రఘురామ ఆరోపించారు. ఈ దిశగా తాను చేసిన ఆరోపణలకు రఘురామరాజు కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు.
గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి, టీటీడీ ఏఈవో ధర్మారెడ్డిలతో కలిసి కేపీ రెడ్డి తనను సీఐడీకి అప్పగించేందుకు కుట్ర పన్నారని రఘురామరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో మఫ్టీ పోలీసులు మకాం వేసేందుకు కేపీ రెడ్డి సహకరించారని ఆరోపించారు.
ఈ క్రమంలో 15 మంది ఏపీ పోలీసుల మెస్ బిల్లులను కూడా రఘురామ తన లేఖకు జతచేసి రాజ్ నాథ్ కు అందజేశారు. రక్షణ శాఖ మంత్రిగా కేపీ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాజ్ నాథ్ ను కోరారు. రఘురామ విజ్ఞప్తిపై స్పందించిన రాజ్ నాథ్… విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం. మొత్తంగా తనపై జరుగుతున్న కుట్రలో ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డికి భాగస్వామ్యం ఉందంటూ రఘురామరాజు ఏకంగా రక్షణ శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.