అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న ఏపీ సీఎం జగన్ తన కేసుల్లో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, అందుకే ఆయన బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చాలా రోజులు పోరాడిన సంగతి తెలిసిందే. జగన్ తో పాటు వైసీపీలో నెంబర్ 2గా కొనసాగుతోన్న ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని నాంపల్లి సీబీఐ కోర్టులో రఘురామ వేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. దీంతో, జగన్ బెయిల్ క్యాన్సిలేషన్ చాప్టర్-1 అలియాస్ జేబీసీ- చాప్టర్ 1 ముగిసినట్లయింది.
అయితే, న్యాయం కోసం, ధర్మం కోసం తన పోరాటం కొనసాగుతుందని, జగన్ బెయిల్ రద్దు కోసం తాను హైకోర్టుకు అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళతానని రఘురామ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని రఘురామ అన్నారు. ఈడీ కోర్టుకు జగన్, విజయసాయి హాజరుకావాల్సి ఉందని, కానీ ఏదో ఒక కారణంతో వారు హాజరు కావడం లేదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.
ఈ కేసు విచారణ ఇంకా ఎన్ని వాయిదాలు పడుతుందో చూడాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కులాలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు సరైనదేనని, చంద్రబాబు పాలనలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. అగ్ర కులాల్లో సగం మంది కాపులు, బలిజ తెలగ వారే ఉన్నారని, కాబట్టి 10 శాతం కోటాలో కాపు, బలిజ, తెలగలకు 5 శాతం, మిగతా 5 శాతం కమ్మ, రెడ్డి, ఇతర అగ్ర సామాజికవర్గాలకు కల్పించాలని ప్రతిపాదించారు.
ఇలా చేయాలని జగన్ కు ఎవరైనా సలహా ఇవ్వాలని కోరారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి వీల్లేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని రఘురామ తెగేసి చెప్పారు. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించకపోతే ఎవరి ఫ్యూజులు పీకేయాలని నిలదీశారు. సినిమా టికెట్ల ధరల నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న పేర్ని నాని.. దసరా సందర్భంగా ఆర్టీసీ చార్జీల పెంపు గురించి ఏం చెబుతారని ప్రశ్నించారు. తాజాగా తెలంగాణ హైకోర్టులో జగన్ బెయిల్ రద్దుకు రఘురామ పిటిషన్ వేయడంతో జేబీసీ చాప్టర్ -2 మొదలైనట్లేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.