వైఎస్ వివేకా హత్య కేసుపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. వివేకాను చంపింది ఎవరో సిపిఐ విచారణలో తీర్థం అయ్యిందని అందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, వివేకాను హత్య చేయించింది ఎవరు అనే విషయమే బయటికి రావాల్సి ఉందని అన్నారు. వివేక మృతదేహానికి కుట్లు వేసిందెవరు, ఆ రక్తాన్ని శుభ్రపరిచింది ఎవరు అనేది తేలాలని చెప్పారు.
సీబీఐ విచారణకు రావాలంటూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారని, దీంతో వివేకా కేసులో అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ కేసులో మరో రెండు అరెస్టులు జరిగే అవకాశం ఉందని చెప్పారు. వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువవుతోందని, విజయసాయిరెడ్డిలో కూడా మార్పు కనిపిస్తోందని చెప్పారు. గత రెండు నెలల నుంచి విజయసాయి ట్వీట్లలో కూడా చాలా మార్పు వచ్చిందని కితాబిచ్చారు.
బలమైన కాపు నేత కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలో చేరడం శుభ రాజకీయ పరిణామం అని అన్నారు. కన్నా చేరిక వైసీపీకి ఇబ్బందికరమని చురకలంటించారు. నందమూరి తారకరత్న చిన్న వయసులోనే హఠాన్మరణం పాలవడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రఘురామ ప్రార్థించారు. తారకరత్న మృతి విషయంలో లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు సరికాదని, సాక్షి పేపర్లో దరిద్రపు రాతలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు. స్వార్థ రాజకీయాలకోసమే తారకరత్నను ఇన్ని రోజులు ఆస్పత్రిలో ఉంచారంటూ లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలపై రఘురామ మండిపడ్డారు.