ఏపీ సీఎం జగన్ పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను, జగన్ పాలనను రఘురామ తనదైన శైలిలో ప్రశ్నిస్తూ ఇరకాటంలో పడేస్తున్న వైనం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు. పంటి కింద రాయిలా…కంటిలో నలుసులా…పక్కలో బల్లెంలా మారిన ఆర్ఆర్ఆర్ ను పల్లెత్తు మాట కూడా అనలేని దుస్థితిలో ఉన్నామని వైసీపీ నేతలు మదనపడుతున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ సర్కార్ ను ఆర్ఆర్ఆర్ ఇరకాటంలో పడేశారు.
ఏపీలో ఫైబర్ నెట్ సంస్థ అక్రమంగా, అనధికారికంగా ఎంఎస్ వో లైసెన్స్ ను ఉపయోగిస్తోందని రఘురామ కేంద్రానికి లేఖ రాశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు రఘురామ లేఖ రాశారు. బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997 కు విరుద్ధంగా ఏపీ పైబర్ నెట్ వ్యవహారం ఉందని లేఖలో పేర్కొన్నారు. బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997 ప్రకారం ప్రభుత్వ సంస్థలు, ఎం.ఎస్.ఓ లైసెన్స్ లు పొందలేవని స్పష్టం చేశారు.
కాబట్టి, ఏపీ సర్కార్ అనధికారికంగా, అక్రమంగా వాడుతున్న ఏపీ ఫైబర్ నెట్ ను అనర్హత జాబితాలో చేర్చాలని రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఏపీ ఫైబర్ నెట్ అక్రమ లైసెన్స్ ను రద్దు చేయాలని రఘురామ కోరారు. తప్పుడు సమాచారాన్ని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ పంపిణీ చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. మరి, రఘరామ లేఖపై కేంద్ర మంత్రి వైష్ణవ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.