విడిగా ఉన్నప్పుడు వంద మాటలు అంటాం. కానీ.. అలా అన్న మాటల్ని.. అదే వ్యక్తి ఎదురైతే మాట్లాడేందుకు సవాలచ్చ ఆలోచిస్తాం. అందులోకి అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి విషయంలో అయితే.. మరింత ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తామే తప్పించి.. తొందరపడి ఒక మాట అనేయటం అంత తేలికైన విషయం కాదు. అందునా..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత ముందు.. మీనాన్న.. మోడీ ఇద్దరూ ఇద్దరూ. ఇద్దరూ వ్యవస్థల్ని తమకున్న అధికారంతో నిర్వీర్యం చేస్తున్నారన్న మాట అనటం.. అందుకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా ఉండేలా మాట్లాడటం అంత తేలికైన విషయం కాదు.
తాము తీవ్రంగా తప్పు పట్టే మోడీని.. ఆయన విధానాల్ని తన తండ్రి కూడా అనుసరిస్తున్నారని.. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని.. తమ వ్యతిరేకుల్ని తొక్కేస్తున్నారన్న విషయాన్ని కవిత ముఖం మీదనే చెబితే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుంది? అనే దానికి తాజాగా నిర్వహించిన ఒక లైవ్ ఇంటర్వ్యూ సాక్ష్యంగా మారింది. ఆంధ్రజ్యోతి అధినేత ఆర్కే తాజాగా ఎమ్మెల్సీ కవితను ఇంటర్వ్యూ చేశారు.
దీన్ని ప్రీరికార్డెడ్ గా కాకుండా లైవ్ లో నిర్వహించిన వైనమే ఒక ఆసక్తికర అంశం అయితే.. ఆ సందర్భంగా కవిత ముఖం మీదనే మీ నాన్న.. మోడీ ఇద్దరూ ఒక్కటే అన్న విషయాన్ని చెప్పేసి.. ఆమె నోటి నుంచి పెద్దగా మాటలు రాకుండా చేసిన టాలెంట్ ఆర్కే సొంతమని చెప్పాలి. ఏమైనా ఇలాంటి ధైర్యం ఆర్కే సొంతమన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ ఇంటర్వ్యూలో మోడీని.. కేసీఆర్ ఒక్కటేనని పోల్చిన వైనం ఎలా చోటు చేసుకుంది? అన్న విషయాన్ని చూస్తే..
మీ మీడియా సంస్థ నన్ను టార్గెట్ చేసిందని ఎమ్మెల్సీ కవిత.. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేను ఉద్దేశించి ఆరోపణ చేయగా ఆయన స్పందించారు. ఆమె మాటలకు ఘాటైన సమాధానం ఇచ్చారు. ‘‘దేశంలో ప్రజాస్వామిక విలువలు సన్నగిల్లుతున్నాయి. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ అలాగే ఉన్నారు. కంటిచూపుతో శాసిస్తున్నారు. పత్రికల పట్ల కూడా రాష్ట్రంలో కేసీఆర్ వ్యవహరించిన తీరుగానే కేంద్రం కూడా వ్యవహరిస్తోంది’’ అని ఓపెన్ గా అనేశారు ఆర్కే.
దీనికి స్పందించిన కవిత.. ‘‘సీఎం కేసీఆర్ రాష్ట్రానికి మంచి చేస్తున్నారు. ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు’’ అని తన తండ్రి పాలనా తీరును మెచ్చుకున్నారు. దీనికి స్పందించిన ఆర్కే.. ‘‘కేసీఆర్ వ్యవహార శైలితో విభేదిస్తున్నా. తెలంగాణకు హాని చేసే పనిని ఆయన చేయరు. అదే విషయాన్ని మా రాతల్లోనూ స్పష్టం చేశాం’’ అని ఆర్కే స్పష్టం చేశారు.
తెలంగాణకు కేసీఆర్ మంచి చేస్తారని నమ్ముతున్నానని, కానీ, ధనిక రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్లారన్న విషయాన్ని కాదనలేమని చెప్పటం ఆర్కేకే చెల్లుతుంది. అప్పులు చేసి సాగునీటి ప్రాజెక్టులు కట్టవచ్చని, కానీ, ఉచితాలు ప్రకటించడం సరైంది కాదన్న ఆయన.. పీఎం, సీఎం శాశ్వతం కాదని, రాష్ట్రమే శాశ్వతమని, అప్పుల పాలైతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన వైనం కవితకు కాస్తంత ఇబ్బందికి గురి చేసేలా చేసిందని చెప్పాలి.