డేవిడ్ వార్నర్.. భారత క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టమైన విదేశీ క్రికెటర్. దశాబ్దానికి పైగా ఐపీఎల్లో ఆడి ఇక్కడ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ ఆస్ట్రేలియా ఆటగాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడినపుడు అతడి క్రేజ్ పీక్స్‌కు చేరింది. కేవలం మైదానంలో ఆటతోనే కాక.. మైదానం అవతలా ఎంటర్టైన్మెంట్ అందిస్తూ అతను మన అభిమానుల మనసులు దోచాడు. ‘పుష్ప’ సహా పలు చిత్రాల రీల్స్‌తో అతను చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఐతే ఎన్నో ఏళ్లు మాంచి డిమాండ్‌తో ఐపీఎల్లో కొనసాగిన వార్నర్‌కు.. కొన్ని నెలల కిందట జరిగిన వేలంలో షాక్ తగిలింది. రూ.2 కోట్ల ప్రాథమిక ధరతో వచ్చిన అతణ్ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు వార్నర్. వార్నర్‌కు వయసు మీద పడి ఉండొచ్చు. ఫామ్ తగ్గి ఉండొచ్చు. కానీ ప్రాథమిక ధరతో అయినా అతణ్ని ఏదో ఒక ఫ్రాంఛైజీ కొని ఉండాల్సిందని అభిమానులు ఫీలయ్యారు. ఐతే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అతడిని కనీస ధరకు కూాడా కొనకపోయినా.. కేవలం ఐదు నిమిషాలు తమ చిత్రంలో నటించినందుకు వార్నర్‌కు ‘రాబిన్ హుడ్’ టీం ఏకంగా రూ.2.5 కోట్లు పారితోషకంగా ఇచ్చిందట.
వార్నర్‌కు గతంలోనూ సినిమా అవకాశాలు వచ్చినా నటించలేదు. అతను తొలిసారిగా వెండితెరపై కనిపించబోయేది ‘రాబిన్ హుడ్’లోనే. ఇందులో తన క్యామియో హైలైట్ అవుతుందని అంటున్నారు. తక్కువ నిడివే అయినప్పటికీ.. ఈ పాత్రలో చేసినందుకు భారీ రెమ్యూనరేషనే ఇచ్చింది టీం. మరి ‘రాబిన్ హుడ్’ నిర్మాతలు ఇచ్చిన అంత పారితోషకానికి వార్నర్ క్యామియో ఎలాంటి రిటర్న్స్ ఇస్తుందో చూడాలి. ఈ సినిమాలో వార్నర్ ‘పుష్ప’కు దగ్గరగా ఉండే లుక్‌తో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల రూపొందించిన ‘రాబిన్ హుడ్’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.