అనుమానాలే నిజమయ్యాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఆగిపోయింది. తాను రాజకీయాల్లోకి రావట్లేదని తలైవా చెప్పేశాడు. ఈ విషయమై సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశాడు రజినీకాంత్.
కొన్నేళ్ల కిందట కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత తన ఆరోగ్యం సున్నితంగా తయారైందని.. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో పార్టీ మొదలుపెట్టడం చాలా కష్టమని.. ఇటీవల అన్నాత్తె షూటింగ్ సందర్భంగా యూనిట్ సభ్యులు కోవిడ్ బారిన పడటం తనకు దేవుడి నుంచి వచ్చిన హెచ్చరికగా భావిస్తున్నానని. ప్రస్తుత పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి రాలేనని రజినీకాంత్ స్పష్టం చేశారు. అభిమానులకు ఇది బాధ కలిగించే విషయమే అయినా.. తన పరిస్థితి అర్థం చేసుకోవాలని సూపర్ స్టార్ కోరారు.
రెండు దశాబ్దాలుగా సాగుతున్న చర్చకు తెర దించుతూ మూడేళ్ల కిందటే తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించిన రజినీ.. పార్టీ మొదలుపెట్టే విషయంలో ఎటూ తేల్చకుండా మూడేళ్లు గడిపేసిన సంగతి తెలిసిందే. ఐతే వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో త్వరలోనే ఆయన పార్టీని మొదలుపెడతారని సంకేతాలు వచ్చాయి. ఐతే కరోనా నేపథ్యంలో రజినీ ప్రణాళికలు దెబ్బ తిన్నాయి. ఒక దశలో ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై వెనక్కి తగ్గినట్లే అని వార్తలొచ్చాయి.
కానీ మళ్లీ మనసు మార్చుకున్నారు. ధైర్యం చేసి పార్టీ మొదలుపెట్డడానికి నిర్ణయించుకున్నారు. ఈ నెల 31న పార్టీ మొదలవుతుందని కూుడా ప్రకటించారు. ఈలోపు ‘అన్నాత్తె’ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేయాలని అనుకున్నారు. హైదరాబాద్‌లో అత్యంత జాగ్రత్తగా షూటింగ్ చేసినప్పటికీ.. యూనిట్లో ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు.
రజినీకి కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ.. బీపీ సమస్యతో రెండు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. సోమవారమే డిశ్చార్జ్ అయి చెన్నైకి చేరుకున్నారాయన. కానీ గత కొన్ని రోజుల్లో ఎదుర్కొన్న టెన్షన్ అదీ చూశాక.. కరోనా ముప్పు పొంచి ఉండగా పార్టీ పెట్టి జనాల్లో తిరిగి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం కరెక్ట్ కాదని రజినీ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.