రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలానే విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ.. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఉన్న ఇమేజ్ కాస్త భిన్నమని చెప్పాలి. ఇటీవల కాలంలో ఈ ఇమేజ్ కాస్తంత మసకబారిపోయినా.. గతంలో దానికున్న ఘన చరిత్ర అంతా ఇంతా కాదు. తాజాగా వర్సిటీ పరిధిలో నిర్వహించిన ఎంఏ పొలిటికల్ సైన్స్ పరీక్షలో అడిగిన ప్రశ్నపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదేం ప్రశ్న అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రా వర్సిటీ శుక్రవారం నిర్వహించిన ఎంఏ పరీక్షా పత్నంలో ఒక ప్రశ్నగా వైఎస్సార్ సీపీ విధానాలు మరియు కార్యక్రమాల గూర్చి వివరించాలంటూ అడిగిన ప్రశ్నను పలువురు తప్పుప డుతున్నారు. ఎంఏ పరీక్షా పత్రంలో 4(బి) ప్రశ్న కింద వైసీపీ గురించి అడగటం ఏ మాత్రం సరికాదన్న మాట వినిపిస్తోంది.
పొలిటికల్ సైన్స్ ప్రశ్నాపత్రంలో ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా ప్రశ్న ఎలా ఇస్తారని.. అదెంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎంఏ ప్రశ్నాపత్రంలో ఇలాంటి ప్రశ్న వచ్చిందన్న విషయాన్ని జనసేన క్రిష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి కమ్ న్యాయవాది అయిన లంకిశెట్టి బాలాజీ తప్పు పట్టటంతో.. ఈ విషయం కాస్తా బయటకు వచ్చింది.