ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం అదిరిపోయే ఝులక్ ఇచ్చింది. తాడేపల్లి లో జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద పోలీసు సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది. అలాగే అక్కడి జనానికి దారి కష్టాలను కూడా తీర్చింది. జగన్ సీఎం గా ఉన్నప్పుడు తాడేపల్లి లోని ఆయన నివాసం ముందు నుంచి సామాన్య ప్రజల రాకపోకలను పోలీసులు కట్టడి చేసిన సంగతి తెలిసిందే.
అటు కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు.. ఇటు కట్ట దిగువనున్న మార్గాలపై బారికేడ్లు ఏర్పాటు చేసి సామాన్యులు రాకుండా ఆంక్షలు విధించారు. దీని కారణంగా స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అదనంగా 1.5 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. అయితే ఏన్టీడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడి జనాలకు దారి కష్టాలు తీరిపోయాయి. ఉండవల్లి నుంచి నేరుగా మంగళగిరి వెళ్లేందుకు రోడ్డు అందుబాటులోకి వచ్చింది.
కొత్త ప్రభుత్వం ఆయా మార్గాల్లో పెట్టిన ఆకాంక్షలను, బారికేడ్లను తొలగించింది. ఆదివారం రాత్రి నుంచి జగన్ ఇంటి ముందు ప్రజల రాకపోకలకు అనుమతి ఇచ్చేసింది. గత ఐదేళ్ల నుంచి మూసి ఉన్న రోడ్డు తెరుచుకోవడంతో.. ప్రజలు ఎంతో ఆనందంగా రయ్ రయ్ మంటూ ఆ రహదారి గుండా దూసుకెళ్తున్నారు.
మరోవైపు మన మాజీ సీఎం తాడేపల్లిలోని తన నివాసం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. ఆ మార్గంలో సాధారణ వాహనాలకు అనుమతి ఇవ్వడం, పోలీస్ సెక్యూరిటీని చంద్రబాబు ప్రభుత్వం తొలగించడంతో.. దాదాపు 30 మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది తాజాగా జగన్ నివాసంలోకి రంగ ప్రవేశం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.