జనసేన 12వ ఆవిర్భావ సభను `జయకేతనం` పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. అయితే జయకేతనం సభలో తమిళనాడు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న భాషా వివాదంపై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు.
`మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని దక్షిణాదిపై రుద్దుతున్నారని వాదిస్తున్నారు.. అన్నీ దేశ భాషలే కదా! తమిళనాడులో హిందీ వద్దు, హిందీ వద్దు అంటుంటే నాకు ఒకటే అనిపించింది. ఇక నుంచి తమిళ చిత్రాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తరాది రాష్ట్రాల నుంచి కావాలి. పనిచేసే వాళ్లు అక్కడ నుంచే కావాలి.. కానీ హిందీని ద్వేషిస్తారు. ఇదెక్కడి న్యాయం?` అంటూ పవన్ కళ్యాణ్ తమిళులను ప్రశ్నించారు.
భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదని.. తమిళనాడుతో సహా భారత దేశమంతటికీ బహుభాషలు ఉండాలని.. ప్రజల మధ్య పరస్పర ప్రేమాభిమానాలు ఉండాలంటే బహుభాషా విధానమే మంచిదని పవన్ అన్నారు. హిందువులు ముస్లింలను చూసి నేర్చుకోవాలని ఈ సందర్భంగా పవన్ హితవుపలికారు. ఎక్కడి వారైనా కావొచ్చు కానీ ముస్లింలు అంతా అరబిక్ లేదా ఉర్దూలోనే దేవుడిని ప్రార్థిస్తారు. ఆ భాష తమకొద్దనే మాట ఎప్పుడూ అనరు. హిందూ ధర్మంలో సంస్కృతంలోనే మంత్రాలు ఉంటాయి. అయినాసరే హిందువులు ఆలయాల్లో సంస్కృతంలో మంత్రాలు చదవకూడదని అంటారని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. “మీ హిందీ భాషను మా మీద రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్` అంటూ ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎంకు కౌంటర్ వేశారు. దీంతో ఆయన ట్వీట్ కాస్త వైరల్ గా మారాయి.