ప్రస్తుతం ప్రపంచమంతా నాటు నాటు మేనియా నడుస్తోంది. ఆ పాటకు ఆస్కార్ దక్కడంతో ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా నాటు నాటు స్టెప్పులేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు ప్రధాని నరేంద్ర మోదీ మొదలు టీడీపీ అధినేత చంద్రబాబు వరకు పలువురు రాజకీయ ప్రముఖులు తమ అభినందనలు తెలియజేస్తున్నారు. విజనరీ డైరెక్టర్ రాజమౌళితోపాటు చిత్ర యూనిట్ సభ్యులందరికీ కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఈ విజయాన్ని ‘అసాధారణమైనది’గా పేర్కొన్నారు ప్రధాని మోదీ. ‘నాటు నాటు’కి ప్రపంచవ్యాప్త ఆదరణ ఉందని, ఇది రాబోయే సంవత్సరాలకు గుర్తుండిపోయే పాటగా ఉంటుందని ప్రధాని అన్నారు. ఇక, ఆస్కార్‌లో రెండో విజయం సాధించినందుకు డాక్యుమెంటరీ చిత్రనిర్మాతలు కార్తికి గోన్సాల్వేస్, గునీత్ మోంగాలను కూడా అభినందించారు. వారి డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ఆస్కార్‌ను గెలుచుకుంది. “వారి పని సుస్థిర అభివృద్ధి, ప్రకృతికి అనుగుణంగా జీవించడం ప్రాముఖ్యతను అద్భుతంగా హైలైట్ చేస్తుంది” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు తెలిపారు. రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, దర్శకుడు రాజమౌళి, నటులు ఎన్టీఆర్, రాంచరణ్ ల ప్రతిభ ద్వారా తెలుగు పాటకు ప్రపంచ వేదిక గౌరవాన్ని ఇవ్వడం ఆనందదాయకమని వెంకయ్యనాయుడు అన్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు గీతం ఆస్కార్ అందుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.
తెలుగుజెండా ఎగురుతోందని, మన తెలుగు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం పట్ల ఎంతో గర్వపడుతున్నానని ఏపీ సీఎం జగన్ చెప్పారు. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిలు ఈ ఘన విజయానికి అర్హులని అన్నారు. వీరితో పాటు పాట రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, ఇతర టీమ్ సభ్యులకు అభినందనలు తెలిపారు.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ను కైవసం చేసుకోవడం ద్వారా ‘నాటునాటు’ పాట చరిత్రలో నిలిచిపోయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతీయ సినీ పరిశ్రమకు ఇదొక గొప్ప సందర్భమని… ముఖ్యంగా తెలుగు పరిశ్రమకు మరింత ప్రత్యేకమైనదని చెప్పారు. రాజమౌళి, కీరవాణి, తారక్, చరణ్, చంద్రబోస్, రాహుల్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ లకు అభినందనలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.