అనతి కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ముద్ర వేయించుకున్న అందాల భామ పూజా హెగ్డే.. 2022, 23లో వరుస పరాజయాలను ఎదుర్కొంది. ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేయించుకుంది. 2024లో సిల్వర్ స్క్రీన్ పై కనిపించని పూజా ఇప్పుడు మళ్లీ జోరు పెంచింది. భాషా బేధం లేకుండా సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తోంది. సూర్య, దళపతి విజయ్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోలతో తెర పంచుకుంటుంది.
పూజ చేతిలో ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో నాలుగు తమిళ చిత్రాలు కాగా.. ఒకటి హిందీ మూవీ. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే ఇండస్ట్రీలో హీరోయిన్లపై జరుగుతున్న వివక్ష గురించి స్పందించింది. `అన్ని పరిశ్రమల్లోనూ హీరోయిన్లు వివక్షకు గురవుతూనే ఉంటారు. ఒక్కోచోట ఒక్కో రకంగా ఉంటుంది. ఉదాహరణకు షూటింగ్ స్పాట్ లో హీరోలా కారవాన్ సెట్ కు చాలా దగ్గరగా ఉంటాయి. కానీ హీరోయిన్లకు మాత్రం ఎక్కడో దూరంగా పెడతారు. తాము బరువైన భారీ కాస్ట్యూమ్స్ ధరించి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇదొక రకమైన వివక్ష` అంటూ పూజా హెగ్డే తన ఆవేదన వ్యక్తం చేసింది.
ఇండస్ట్రీలో హీరోయిన్లపై ఓ రకమైన చిన్న చూపు ఉంటుందని, కొన్నిసార్లు సినిమా పోస్టర్ల పై హీరోయిన్ల పేరు కూడా వేయరని అసంతృప్తి వ్యక్తం చేసింది. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో అంటూ అగ్ర నటులతో తెర పంచుకుంటున్నప్పటికీ.. తనను తాను సెకండ్ గ్రేడ్ వ్యక్తిగానే భావిస్తానని పూజా తెలిపింది. సినిమా అనేది సమిష్టి కృషి.. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని బుట్టబొమ్మ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, పూజా ప్రస్తుతం సూర్యతో `రెట్రో`, రజనీకాంత్ తో `కూలీ`, విజయ్ తో `జన నాయగన్` మరియు `కాంచన 4` చిత్రంలో యాక్ట్ చేస్తోంది. వీటితో పాటు ఒక బాలీవుడ్ మూవీలోనూ నటిస్తోంది.