నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఇటీవల జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్…మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విపక్ష నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తమ సమస్యలను చెప్పుకునేందుకు స్టేజి దగ్గరకు వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్స్, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, గిరిజన మహిళలను కుక్కలు (Dogs) అని కేసీఆర్ సంభోదించారంటూ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పై పలువురు కాంగ్రెస్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కుక్కలకు విశ్వాసం ఉందని, కానీ, సీఎం కేసీఆర్‌కు విశ్వాసం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు సీఎం పదవి చెప్పుతో సమానమైతే తక్షణమే ఆ పదవికి రాజీనామా చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ అహంకారం తగ్గించుకోవాలని, విపక్ష నేతల మీద నోటికొచ్చినట్టు మాట్లాడడం మాని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని హితవు పలికారు. కేసీఆర్‌ను గద్దె దించే దాకా మంత్రి కేటీఆర్ వదలడని, టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్లు చేశారు. మహిళలను కుక్కలతో పోల్చిన సీఎం కేసీఆర్ కూడా కుక్కనే అని పొన్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌లో అసహనం. కేటీఆర్ కు అహంకారం పెరిగిందని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉండేవారని పొన్నం నిలదీశారు. టీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పరిస్థితి ఆగమ్యచారంగా మారిందని, బంగారు తెలంగాణ అంటే ఇది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.