ఏపీ అధికార పార్టీ వైసీపీ వేస్తున్న వ్యూహాలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇలా చేసి.. పార్టీని రచ్చ చేసుకుంటున్నారా? అనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏం చేసినా..పార్టీ పరువు పోకుండా కాపాడుకోవా ల్సిన బాధ్యత అనేది ప్రతి ఒక్క నాయకుడిపైనా ఉంటుంది. అయితే.. ఓ విషయంలో వైసీపీ తెగేలాగా లాగుతున్న తీరు.. సరికాదనే వాదన వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. సొంత పార్టీ ఎంపీ.. రఘు రామకృష్ణరాజు విషయం.. వైసీపీలో తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
ఎంపీ రఘురామ.. వైసీపీ తరఫున గెలిచారని.. కానీ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. దీంతో ఆయన పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్టేనని.. పేర్కొంటూ.. అనర్హత వేటు వేయించేలా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అయితే.. ఈ పరిణామంపై వెంటనే చర్యలు తీసుకునే అవకాశం స్పీకర్‌కు ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా చూసుకుంటే.. రఘురామ రేంజ్లో కాకపోయినా.. స్వపక్షంలోనే విపక్షం అనదగిన నాయకులు.. చాలా మంది చాలా పార్టీల్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా బీజేపీలోనే చాలా మంది సీనియర్ నాయకులు ప్రధాని మోడీ వ్యవహార శైలిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ, తృణమూల్.. ఇలా అనేక పార్టీల్లోనూ ఈ వ్యతిరేక గళాలు వినిపించే నాయకులు ఉన్నారు. సో.. ఇప్పుడు రఘురామపై చర్యలు తీసుకుంటే.. వాక్ స్వాతంత్య్రంపై చర్యలు తీసుకున్నారనే అపవాదు పార్లమెంటుకు రావడంతోపాటు.. ఇక, వ్యతిరేక గళం వినిపిస్తే.. వేటే.. అనే సంకేతాలు రాజకీయ నేతలకు పంపినట్టు అవుతుంది. ఇది మరింతగా మోడీ ప్రతిష్టను, పార్లమెంటు ఖ్యాతిని కూడా అపహాస్యం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రఘురామ విషయంలో ఇటు పార్లమెంటు అటు కేంద్రం కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి.
అయితే.. వైసీపీ మాత్రం ఈ విషయంలో ఇప్పటికిప్పుడు తాడోపేడో తేల్చుకోవాలనుకునే ధోరణిలో ఉండ డం వల్ల పార్టీ ఒకింత ఇబ్బందుల్లో పడిందనే వాదన వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో ఈ విషయం చర్చనీ యాంశంగా మారింది. తాజాగా రఘురామ కంపెనీల ద్వారా 900 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని.. ఇప్పుడో ఎప్పుడో.. ఆయన కూడా విజయ్ మాల్యా మాదిరిగా దేశం విడిచి పోవచ్చని.. పేర్కొంటూ.. వైసీపీ ఎంపీలు ఏకంగా రాష్ట్రపతి, ప్రధానులకు ఫిర్యాదు చేయడంపై జాతీయ మీడియా ఒకింత విస్మయం వ్యక్తం చేస్తోంది.
రఘురామకు టికెట్ ఇచ్చినప్పుడు ఇలాంటి ఆరోపణలు ఉన్న విషయం తెలిసి కూడా ఇచ్చారు కదా.. ఇప్పుడు ఇలా రాష్ట్రపతికి లేఖ రాయడం అంటే.. పార్టీ పరువు పోగొట్టుకున్నట్టు కాదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అదేసమయంలో ఏదైనా ఉంటే.. రాజకీయంగా తేల్చుకోవాలే.. తప్ప.. ఒకరిపై ఒకరు పిల్లి-ఎలుక మాదిరిగా వ్యవహరిస్తే.. వైసీపీపై భిన్నాభిప్రాయాలు వస్తాయని.. నేతలపై పట్టు లేకుండా పోతోందా? అనే సందేహాలు కూడా వచ్చే అవకాశం ఉందని.. పరిశీలకులు హెచ్చరిస్తుండడం గమనార్హం.