తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మరో కీలక వ్యవహారం.. బెట్టింగ్ యాప్స్. ఈ యాప్స్ బారిన పడి.. ఈ ఏడాది ఇప్పటి వరకు 18 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని అధికారులు లెక్కలు తీశారు. దీంతో ప్రభుత్వం అలెర్టయి.. బెట్టింగ్ యాప్‌లను కట్టడి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ యాప్‌లకు విపరీత ప్రచారం కల్పిస్తున్న సినీ తారలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు.. ఇలా అన్ని వర్గాల వారిపైనా దృష్టి పెట్టారు. శనివారం.. పలువురు తారలపైనా ఇన్ఫ్లుయెన్సర్లపైనా కేసులు నమోదు చేశారు.
ఒకరిద్దరిని విచారణకు కూడా పిలిచారు. శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సుమారు 25 మంది తారలు.. యూట్యూబర్లపై కేసులు పెట్టారు. ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ, రెబల్ స్టార్ ప్రభాస్, మరో హీరో గోపీచంద్ సహా మరి కొందరిపైనా కేసులు పెట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు. రామారావు అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా పోలీ సులను అప్రోచ్ అయ్యారు. వీరు సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారని తెలిపారు. వీరు బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేస్తున్నట్టు ఆధారాలు సమర్పించారు.
తద్వారా.. అమాయకపు యువత బెట్టింగ్ యాప్‌ల బారిన పడి.. తమ జీవితాలను నాశనం చేసుకుంటోంద ని రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. `ఫన్88` అనే బెట్టింగ్ యాప్ ప్రస్తుతం విస్తృతంగా ఫాలో అప్ లో ఉందని రామారావు తన ఫిర్యాదులో వివరించారు. దీనిని బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ప్రమోట్ చేస్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో సదరు యాప్‌లో ఆడి.. యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు కూడా లక్షల రూపాయలు నష్టపోతున్నట్టు రామారావు వివరించారు. ఇది ఆత్మహత్యలకు దారితీస్తోంద న్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేయాలని విన్నవించారు.