దేశం చూపును తనవైపు తిప్పుకొంటున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో చివరి ఘట్టానికి సమయం సమీపిస్తున్న సంగతి తెలిసిందే. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. ఇలా చివరి విడత పోలింగ్, ఫలితాల వెల్లడి సమీపిస్తున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన కామెంట్లు చేశారు. తన చావును కొందరు కోరుకుంటున్నారని కలకలం పుట్టిన వ్యాఖ్యలు చేశారు.
వారణాసి ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేశ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “కొంత మంది రాజకీయ ప్రత్యర్థులు నా చావు కోసం కాశీలో ప్రార్థనలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇంతగా దిగజారిపోతుండటాన్ని దేశంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో నేను అనందంగా ఉన్నా. ఎందుకంటే నా మరణం వరకు నేను కాశీని విడిచిపెట్టను. అదేవిధంగా ఇక్కడి ప్రజలు కూడా నన్ను వదులుకోరు“ అని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి చేసిన ఈ కామెంట్లు చర్చకు తెరలేపాయి. ఇంకా చెప్పాలంటే, అసలేం జరుగుతోందన్న అనుమానలను సైతం రేకెత్తించాయి.
కాగా, యూపీ ఎన్నికల్లో గెలుపొంది తిరిగి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుండగా యోగి సర్కార్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రియాంక గాంధీ ఇమేజ్‌తో యూపీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ చెమటోడుస్తుండగా. దళితులు, అణగారిన వర్గాల వెన్నుదన్నుతో ప్రధాన పార్టీలకు దీటుగా బదులివ్వాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పావులు కదుపుతోంది.