అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీలకు మధ్య మంచి స్నేహ బంధం ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన హయాంలో మోడీని అమెరికాకు ఆహ్వానించిన ట్రంప్…హౌడీ మోడీ అంటూ భారీ కార్యక్రమాలతో స్వాగతం పలికి తన మిత్రబంధాన్ని చాటిచెప్పారు. ఇక, భారత్ లో కరోనా పురుడు పోసుకుంటున్న సమయంలో లక్ష మందితో నమస్తే ట్రంప్ అంటూ మోడీ అదే రీతిలో ట్రంప్ నకు స్వాగతం పలికారు.
గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ట్రంప్ గెలవాలని బలంగా కోరుకున్నవారిలో మోడీ ముందువరుసలో ఉంటారు. ఫాసిస్టు విధానాలకు పెద్దపీట వేసే ట్రంప్, మోడీల జోడీ గురించి విమర్శలు కూడా వచ్చాయి. అయితే, అనూహ్యంగా తన మిత్రుడు ట్రంప్ ఓటమి పాలవ్వడంతో మోడీ కాస్త నిరాశ చెందారు. అయితేనేం, ఏ ఎండకా గొడుగు అన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వతహాగా డెమోక్రాట్ అయిన బైడెన్….తన శత్రువు ట్రంప్ నకు మిత్రుడైన మోడీకి అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు.
ఈ నేపథ్యంలోనే బైడెన్ అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా మోడీతో భేటీ అవుతున్నారు. వీరిద్దరి సమావేశంపై వైట్ హౌస్ తాజాగా అధికారికంగా ప్రకటన చేసింది. సెప్టెంబర్ 24న జో బైడెన్, నరేంద్ర మోడీల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుందని వైట్ హౌస్ వెల్లడించింది. వాషింగ్టన్లో సెప్టెంబర్ 24న నిర్వహిస్తున్న క్వాద్రిలేటరల్ ఫ్రేమ్‌వర్క్ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ అధ్యక్షుడు యోషిహిడే సుగ, అమెరికా అధ్యక్షుడు జో బైడన్, ప్రధాని మోడీ పాల్గొంటారు.
సెప్టెంబర్ 25న న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగే కార్యక్రమంలో మోడీ పాల్గొనబోతున్నారు. సెప్టెంబర్ 23న మోడీ.. జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులతో విడివిడిగా సమావేశం కానున్నారు. బైడెన్ తో మోడీ భేటీలో చైనా ఆధిపత్యం, పాకిస్థాన్ తో సంబంధాలు, తీవ్రవాదంపై ఉమ్మడిపోరు, అఫ్ఘాన్ లో పరిస్థితులు వంటి పలు విషయాలు చర్చకు రానున్నాయని తెలుస్తోంది. గతంలో వర్చువల్ ద్వారా జరిగిన క్వాడ్ సమ్మిట్, క్లైమేట్ చేంజ్ సమ్మిట్, జీ-7 సమావేశాల్లో మోడీ, బైడెన్ పాల్గొన్న సంగతి తెలిసిందే.