‘ipac’ అధినేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే గురించి రాజకీయాలతో కొద్దో గొప్పో టచ్ ఉన్నవారికి పరిచయం అక్కర లేదు. 2014లో ప్రధానిగా మోదీని, బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ను గద్దెనెక్కించడంలో పీకేదే కీలక పాత్ర అంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత ఒక్క యూపీ మాజీ సీఎం అఖిలేష్ మినహా జగన్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటి ఎందరినో సీఎంలను చేశాడు. రాజకీయ వ్యూహకర్తగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న పీకే, ఇపుడు కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పావులు కదుపుతున్నాడు.
అటువంటి పీకేకు ఫెడరల్ ఫ్రంట్ ఫ్రెండ్ గా సీఎం కేసీఆర్ దొరికారు. ఈ ఇద్దరి టార్గెట్ ఒకటే కావడంతో అతి తక్కువ కాలంలోనే సన్నిహితులయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకోసం పీకే పనిచేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పీకేతో కేసీఆర్ రూ. 300 కోట్ల ప్యాకేజీ మాట్లాడుకున్నారని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆ వార్తలను ఖండించిన కేసీఆర్…పీకేపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇప్పటివరకు మొత్తం 12 రాష్ట్రాల ఎన్నికలలో పని చేసిన పీకే…తన జీవితంలో ఎన్నడూ డబ్బులు తీసుకొని పనిచేయలేదంటూ కేసీఆర్ కితాబిచ్చారు. ఆయన పెయిడ్ వర్కర్ కాదని, పీకేతో ఏడేళ్ల నుంచి స్నేహం ఉందని చెప్పారు కేసీఆర్. మంచి మనిషిని అలా బద్నాం చేయడం సరికాదంటూ విపక్ష నేతలకు హితవు పలికారు. దీంతో, కేసీఆర్ కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారంలోకి వచ్చేందుకు కొన్ని పార్టీలు వేల కోట్లు కుమ్మరించి పీకేతో ఒప్పందం చేసుకునేందుకు తహతహలాడుతుంటాయి. పీకేకు ప్రత్యేకంగా వందల కోట్ల ఫీజు ముట్టజెప్పేందుకు క్యూలో నిలబడుతున్నాయి. ఈ క్రమంలో ‘పీకే.. ఫ్రీకే’ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. 2014లో మోదీని ప్రధాని చేయడం మొదలు…వివిధ రాష్ట్రాల్లో పార్టీలకోసం పనిచేసినందుకు పీకే డబ్బులు తీసుకున్నారని విపక్షాలు ఆధారాలతో సహా బట్టబయలు చేస్తున్నాయి..
పీకేకు చెందిన ఐప్యాక్ కు రూ.37.57 కోట్లు చెల్లించామని ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల ఖర్చు నివేదికలో వైసీపీ స్వయంగా వెల్లడించింది. అధికారికంగా ఇంత చెల్లించారని, అనధికారికంగా ఎన్నో రెట్లు అధికంగా ముట్టజెప్పారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బిహార్ 2025 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన వంటి చిన్న పనికే పీకే రూ.9.31 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి.
2017లో పంజాబ్‌లో కాంగ్రె్‌సను, 2020లో ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీని, ఇటీవల తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేను గెలిపించేందుకు పీకే పీకే భారీ మొత్తం పుచ్చుకున్నారని టాక్. ఇక, తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగిన పీకే టీం…రూ. 500 కోట్ల ప్యాకేజీ మాట్లాడుకుందని టాక్.