ఏపీ ప్రభుత్వం తాజాగా.. అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాస్తవానికి శనివారం.. కోర్టుకు సెలవు. అదేవిధంగా తదుపరి రోజు ఆదివారం. అంటే ఈ విషయం ముందుగానేతెలిసి.. ఏపీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించింద నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిని రైతుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రతోనే ఇలా చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం.. రాజధాని అమరావతి రైతులు.. మహాపాదయాత్ర 2.0ను నిర్వహిస్తున్నారు. ఇది అమరావతి నుంచి అరసవల్లి వరకు సాగుతోంది. దీనిని వైసీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరాంధ్ర పై విషం చిమ్ముతున్నారంటూ.. రైతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలోకి వస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవని కూడా చెబుతున్నారు. సో.. ఈ పరిణామాలను గమనిస్తే.. రాజధాని పాదయాత్రను నిలువరించే విధంగా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒకవైపు.. మంత్రులు.. నాయకులు.. రైతులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వారిని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఇక,సీఎం జగన్ కూడా సాక్షాత్తూఅసెంబ్లీలో అమరావతినికట్టలేమని.. కట్టేది కూడా లేదని.. స్పష్టం చేసి.. మరింతగా రైతులను మనక్షోభకు గురి చేశారు. వారిలో స్థయిర్యాన్ని మరింత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం తోసిరాజని.. సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు.
హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని.. మూడు రాజధానులకే.. తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అమరా వతిని నిర్మించడం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మించిన వ్యవహారమని.. పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులను మరింతగా ఇబ్బంది పెట్టే వ్యూహమే తప్ప.. దీనిలో మరొకటి దాగి లేదని.. పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. పాదయాత్రను నిలిపివేయడంఎలానూ సాధ్యం కాదు కాబట్టి.. రైతులను మానసికంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అంటున్నారు. మరి దీనిపై రైతులు ఏం చేస్తారో చూడాలి.