సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ ఒంటరివాడిని అంటుంటారని, కానీ, అవకాశం వస్తే అందరినీ తొక్కేస్తారని విమర్శించారు. ఇక, మీరు ‘సిద్ధం’ అంటే… మేం ‘యుద్ధం’ అంటామని పవన్ అన్నారు. తనను విశాఖలో అడ్డుకున్నారని, చంద్రబాబు అరెస్టు సమయంలో రాష్ట్ర సరిహద్దులో ఆపారని, తనను ఎక్కడైనా ఆపాలని చూస్తే మాట్లాడనని, చేతల్లో చూపిస్తా అని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
గత ఎన్నికల్లో ఓడిపోయాక మరింత బలపడ్డామని, కష్టాల్లో ఉన్న టీడీపీకి ఇపుడు అండగా నిలబడ్డామని అన్నారు. కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్ అని, కులాల కుమ్ములాటలతో జనం కొట్టుకోవాలనేదే జగన్ నైజం అని చురకలంటించారు. కానీ, కలిపేవారినే ప్రజలు గుర్తుంచుకుంటారని, విడదీసే వారిని కాదని పవన్ క్లారిటీనిచ్చారు. జగన్ విష సంస్కృతి తిరిగి ఆయన ఇంటికే వచ్చిందని, చెల్లెలికే ఆస్తి ఇవ్వని వ్యక్తి మనకేం చేస్తారని ప్రశ్నించారు.
అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం గొప్పేనా? అని పవన్ ప్రశ్నించారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు పవన్. జనసేన-టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పథకాలు ఆపేస్తారని జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ లోనూ సంక్షేమ పథకాలు కొనసాగుతాయని పవన్ అన్నారు. డబ్బుతో ఓట్లు కొనని రాజకీయాలు రావాలని పవన్ ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన-టీడీపీ కూటమికి బీజేపీ ఆశీర్వాదం కావాలని పవన్ అన్నారు.