ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న జనసేన అధినేత పవన్ ను వైసీపీ సర్కార్ అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన బస్సు యాత్ర కోసం సిద్ధం చేసిన ‘వారాహి’వాహనంపై కూడా వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన పవన్…వైసీపీ నేతలకు చురకలంటించారు.ఈ ప్రభుత్వం తనను అడుగడుగునా అడ్డుకుంటోందని, తన సినిమాలను అడ్డుకోవడం మొదలు విశాఖలో హోటల్ కే పరిమితం చేయడం వరకు రకరకాలుగా వేధిస్తోందని ఫైర్ అయ్యారు.
ఇప్పటంలో తన కారు ఆపారని, నడిచి వెళ్లడానికి కూడా ఆటంకాలు కలిగించారని విమర్శించారు. తాజాగా తన ప్రచార రథం వారాహిపై కూడా వివాదం రేపుతున్నారని దుయ్యబట్టారు. పోనీ, నన్ను ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయమంటారా? అంటూ పవన్ ఘాటుగా ప్రశ్నించారు. కనీసం ఈ చొక్కాను అయినా వేసుకోనిస్తారా వైసీపీ? అంటూ ఆలివ్ గ్రీన్ షర్ట్ చూపిస్తూ పవన్ ట్వీట్ చేశారు.
అంతకుముందు, వారాహికి తెలుపు, నలుపు, కాకుండా పసుపు రంగు వేసుకుంటే సరిపోతుందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఆలివ్ గ్రీన్ రంగు మిలిటరీ వాహనాలకు మాత్రమే వాడతారని, పవన్ వాహనానికి ఆ రంగు వేయడం చట్ట విరుద్ధమని అన్నారు. లక్షల పుస్తకాలు చదివిన పవన్ కు మోటార్ వెహికల్ యాక్ట్ పుస్తకం చదివే తీరిక లేదా అని ప్రశ్నించారు. డబ్బున్న వారు వ్యాన్లను కొనుక్కుని యుద్ధం చేస్తామంటే కుదరదని అన్నారు. ఇలాంటివి సినిమాల్లో నడుస్తాయని, నిజ జీవితంలో కుదరవని నాని విమర్శించారు. ఈ విమర్శల నేపథ్యంలోనే వైసీపీ నేతలపై పవన్ ఫైర్ అవుతున్నారు.