వచ్చే ఎన్నికల్లో ఏపీలో పొత్తులు ఖాయమని జనసేన అధినేత పవన్ వ్యాఖ్యానించారు. బలమున్న ప్రధాన పార్టీలతో జనసేన పార్టీ కలిసి నడుస్తుందని చెప్పారు. పొత్తులతోనే చాలా పార్టీలు బలపడ్డాయని చెప్పారు. ప్రస్తుతం బలంగా ఉన్న బీజేపీ కూడా ఒకప్పుడు పొత్తులు పెట్టుకున్న పార్టీనేనని పవన్ గుర్తు చేయడం విశేషం. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకూడదనేది తన నిర్ణయమన్నారు.
దీనికి వైసీపీ అరాచక పాలనే కారణమని తెలిపారు. 2014లో కూడా చాలా అధ్యయనం చేశాకే బీజేపీతో, టీడీపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుందని అన్నారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో మాత్రం పార్టీని సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించినట్టు చెప్పారు. అవసరమైనప్పుడు కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటామని.. తాను సీఎం అభ్యర్థిని అయితేనే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని చెప్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రజలు 40 స్థానాలు ఇచ్చినా.. తాను సీఎం పదవి డిమాండ్ చేసేవాడిని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా కర్ణాటకలో కుమార స్వామి 30 సీట్లతోనే సీఎం అయ్యారని పవన్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తుల గురించి మాట్లాడుతున్నట్టు చెప్పారు. తమ గౌరవానికి భంగం కలగకపోతే పొత్తులకు తాము సిద్ధమని తెలిపారు. గతంతో పోలిస్తే జనసేన పార్టీకి రాష్ట్రంలో బలం బాగా పెరిగిందన్నారు.
ముందస్తుకు రెడీ!
ముందస్తు ఎన్నికలపై కూడా పార్టీలో చర్చలు జరుపుతున్నామని పవన్వెల్లడించారు. అందరితో కలుపుకునిపోయే వ్యక్తిత్వం తనదని.. కమ్యూనిస్టులు, బీజేపీ సైద్ధాంతికంగా కలవని పవన్ తెలిపారు. ఓట్లు చీలనివ్వనంటే ప్రధాన పార్టీలు కలవాలన్నదే తన ప్రధాన ఉద్దేశమన్నారు. ఎన్నికల పొత్తులంటే చాలా కష్టమైన వ్యవహారం అని పవన్ వివరించారు.