విశాఖ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పదవిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి ఎవరన్న సంగతి తాను, చంద్రబాబు చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జనసేన అభ్యర్థులతోపాటు టీడీపీ అభ్యర్థులను కూడా రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తే సీఎం పోస్ట్ అడగొచ్చని జనసైనికులనుద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. జనసేన ఎవరికీ బీ పార్టీ కాదని, టీడీపీతో జనసేన కలిసి నడుస్తోందని, టీడీపీ వెనక కాదని పవన్ అన్నారు.
రాష్ట్రాభివృద్ధికి టీడీపీ-జనసేన పొత్తు తప్ప మరో మార్గం లేదన్నారు. జనసైనికుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టనని, తనను తాను తగ్గించునకైనానా జనసైనికులను పెంచుతానని పవన్ చెప్పారు. మహిళల మీద దాడుల్లో ఏపీ 6వ స్థానంలో ఉందని, తమ ప్రభుత్వం వస్తే పోలీస్ శాఖకు పూర్వ వైభవం తెస్తానని చెప్పారు. తనకు అహంకారం లేదని, జనసేన ఎంపీ ఒక్కరున్నా స్టీల్ ప్లాంట్ గనులు సాధించేవాడిని పవన్ చెప్పారు.
తాను ఓడినపుడు విశాఖ గుండెలకు హత్తుకుందని, జగన్ కిరాయి గుండాలను ఎదుర్కొనే ధైర్యం వైజాగ్ ఇచ్చిందన్నారు. జానీ సినిమాలో పాటను ఏపీలో పరిస్థితులకు పవన్ అన్వయించారు. గంజాయి, డ్రగ్స్ తో వేల కోట్లు వైసీపీ నేతలు సంపాదించారని, ప్రమాదకర స్థాయికి వైసీపీ నేతల అవినీతి వెళ్ళిందన్నారు. మార్పు, సుస్థిరత కోసం జనసేన-టీడీపీకి ఓటేయాలని, సంక్షేమ కార్యక్రమాలు తమ ప్రభుత్వంలో కూడా ఆగవని చెప్పారు.