జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి అక్కడ నిర్మల సీతారామన్ వంటి నేతలతో కలిసి అప్పులు, నిధులు అడిగిన వైనంపై ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక, తన కేసులతో పాటు వివేకా హత్య కేసు గురించి మాట్లాడేందుకే జగన్ పదేపదే ఢిల్లీ వెళుతున్నారని ప్రతిపక్ష నేతలు చాలాకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక, అదే సమయంలో బీజేపీకి దూరంగా ఉంటున్నప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఢిల్లీ పెద్దలు పదే పదే తమ దగ్గరికి పిలిపించుకుని మాట్లాడుతున్నారని జనసేన నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్…బిజెపి జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ భేటీ తర్వాత జనసేన రాజకీయాల వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పవన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ రెండు రోజుల పర్యటనలో పలువురు ప్రముఖులను కలిశామని, చాలా రోజులుగా ఈ సమావేశాల గురించి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో స్థిరత్వం ఉండాలని కోరుకుంటున్నానని, వైసీపీ విముక్తాంధ్రప్రదేశ్ ఎజెండాగా జనసేన, బీజేపీ ముందుకు వెళ్తున్నాయని అన్నారు. ఆ విషయంపైనే లోతుగా అన్ని కోణాల నుంచి ఈ సమావేశాలలో చర్చించామని పవన్ మీడియాకు వెల్లడించారు.
ఈ చర్చల సత్ఫలితాలు రాబోయే రోజుల్లో స్పష్టంగా కనిపిస్తాయని అన్నారుజ వైసిపి వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న అంశం కూడా కీలకమని చెప్పారు. జనసేనతోపాటు బిజెపిని కూడా బలోపేతం చేసే దిశగా ఆలోచించి సంస్థాగత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. అధికారం సాధించే దిశగా ఎలా అడుగులు వేయాలో అని ఆలోచిస్తున్నామని చెప్పారు. ఏది ఏమైనా ఢిల్లీ టూర్ తర్వాత టీడీపీకి పవన్ షాకిచ్చారని, బీజేపీతో ముందుకు వెళ్తాం అన్న సంకేతాలిచ్చారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.