జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో చేపట్టిన వారాహి యాత్ర ఈ రోజు ముగిసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్…జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రను గుప్పెట్లో పెట్టుకోవడానికి తప్ప విశాఖపై జగన్ కు ప్రత్యేకమైన అభిమానం లేదని పవన్ విమర్శించారు. విశాఖలో 15 వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజాల అక్రమ తవ్వకాలు జరిగాయని, బాక్సైట్ పేరుతో లేటరైట్ తవ్వకాలు సాగుతున్నాయని పవన్ ఆరోపించారు. ఆడపిల్లల మిస్సింగ్ కేసులపై విచారణ చేస్తామని పోలీసులు చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందని, ఇక తనకే చిత్తూరు ఎస్పీ క్లాస్ పీకే ప్రయత్నం చేశారని పవన్ అన్నారు.
ఏపీలో పొత్తులపై కూడా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పొత్తా? లేక బీజేపీతో వెళ్లడమా? అన్నది తేల్చేందుకు చర్చలు జరుగుతున్నాయని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింగిల్ గా వెళ్లినా..పొత్తులతో వెళ్లినా…ఓట్లు చీలకూడదన్నదే తన ఉద్దేశ్యమని పవన్ క్లారిటీనిచ్చారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాడతామిన చెప్పారు. జగన్ పక్కా వ్యాపారి అని, క్రిమినాలిటీ వ్యవస్థీకృతం చేశారని ఆరోపించారు. ఇక, తాను సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు.
అయితే, ప్రజలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి ఉంటుందని చెప్పారు. బ్రిటిష్ వాళ్లలా జగన్ విభజించి పాలిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, బాధితులు పోలీసుల వద్దకు వెళ్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తన దగ్గరకు 400 పిటిషన్లు వచ్చాయని చెప్పారు. 2004 నుండి విశాఖలో కొన్న భూములు కాపాడుకునేందుకే విశాఖకు జగన్ వస్తున్నారని విమర్శలు గుప్పించారు. జగన్ వ్యాపారి అని, వ్యాపారం చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో చైతన్యం ఉన్నప్పటికీ వైసీపీ నాయకుల చేతుల్లో అది బందీ అయిందని అన్నారు. మహిళలపై లైంగిక దాడి జరిగితే హోంమంత్రి వచ్చి తల్లిదండ్రుల పెంపకం తప్పు అంటున్నారని మండిపడ్డారు.