రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, కొద్ది రోజుల క్రితం టీడీపీపై బీజేపీ నేతలు చేసిన కామెంట్లు..ఆ ప్రచారానికి తెరదించాయి. దానికితోడు ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీఏ సమావేశానికి టీడీపీకి పిలుపు రాకపోవడం, అదే సమయంలో జనసేన తరపున పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందడం వంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీకి టీడీపీకి దోస్తీ కట్ అయినట్లేనని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో బీజేపీ, టీడీపీల పొత్తుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడిన పవన్…బీజేపీ, జనసేన, టీడీపీలు మరోసారి పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని హింట్ ఇచ్చారు. 2014లో తాము మిత్రపక్షంగా పోటీ చేశామని, 2019లో విడిపోయామని అన్నారు. ఆ తర్వాత బీజేపీతో జనసేన కలిసిందని, కానీ, టీడీపీ, బీజేపీల మధ్య కాస్త అవగాహన లోపం ఏర్పడిందని చెప్పారు. అయితే, ఆ రెండు పార్టీల ఇష్యూస్ గురించి తాను స్పందించడం పద్ధతి కాదని తెలిపారు. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న పొరపచ్ఛాలను సరిదిద్దుకొని 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒకవేళ బీజేపీ, జనసేన, టీడీపీలు కలిపి పోటీ చేస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది సమస్య కాదని, ఎన్నికల సమయంలో ఆ విషయంపై క్లారిటీ వస్తుందని చెప్పారు. కానీ, జనసేన కేడర్ తనను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటోందని అన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో పార్టీ బలాల ఆధారంగా నిర్ణయాలుంటాయని తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా వైసీపీని ఓడించడం, రాష్ట్రాభివృద్ధి తమ అంతిమ లక్ష్యమని చెప్పారు. వాలంటీర్లు ప్రజల డేటాను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని, ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని ఆరోపించారు.